‘కశ్మీర్’కు ప్రేమ మంత్రం | love Mantra to 'Kashmir' | Sakshi
Sakshi News home page

‘కశ్మీర్’కు ప్రేమ మంత్రం

Published Mon, Aug 29 2016 1:58 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

‘కశ్మీర్’కు ప్రేమ మంత్రం - Sakshi

‘కశ్మీర్’కు ప్రేమ మంత్రం

- కశ్మీర్‌లో పిల్లలను రెచ్చగొట్టి రాళ్లేయిస్తున్నారు
- జీఎస్టీ కోసం అన్ని పార్టీలు ఏకమవటం శుభపరిణామం
- పర్యావరణ అనుకూల గణపతిని వాడండి
- మన్ కీ బాత్‌లో పేర్కొన్న ప్రధాని  మోదీ
 
 న్యూఢిల్లీ: కశ్మీరీలకు చేరువయ్యేందుకు ఐకమత్యం, ప్రేమలే ప్రధాన మార్గాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోయలో అమాయకులైన పిల్లలను కూడా హింసలో భాగం చేస్తున్న వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం సందర్భంగా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. లోయలో జరుగుతున్న అల్లర్లలో ప్రాణాలు కోల్పేయే యువకుడైనా.. భద్రతా సిబ్బంది అయినా మనవాళ్లేనన్న విషయం మరిచిపోవద్దన్నారు. ఈ విషయం ప్రధాని నుంచి గ్రామసేవకుడి వరకు అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అమాయక యువతను, చిన్నపిల్లలను రెచ్చగొట్టి రాళ్లేయిస్తున్నవారంతా.. ఒక రోజు ఈ చిన్నారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో సమావేశంలో మూడు అంశాల ఫార్ములాపై చర్చించిన నేపథ్యంలోనే నేటి మన్‌కీ బాత్‌లో ఈ అంశాలను మోదీ స్పృశించారు.

కశ్మీర్‌లో అస్థిరతకు ముగింపు పలికేందుకు అఖిలపక్షంతో సమావేశమై.. వారినుంచి తీసుకున్న సలహాలతో.. ‘ఏకత’, ‘మమత’ ద్వారానే సమస్య పరిష్కారమని తనకు అర్థమైందన్నారు. లోయలో ప్రజలకు మేమున్నామనే సందేశాన్నివ్వటం ద్వారా ప్రపంచానికి, వేర్పాటువాదులకు స్పష్టమైన సంకేతాన్నివ్వాలని అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. దీంతోపాటు ప్రతిష్టాత్మక జీఎస్టీ బిల్లు ఆమోదం పొందటంలోనూ అన్ని రాజకీయ పార్టీల సహకారం మరువలేనిదన్నారు. రాజకీయంగా బద్ధవిరోధులైనా.. దేశం కోసం అందరూ ఒకటవటం శుభపరిణామమన్నారు. దీంతోపాటు సెప్టెంబర్ 4న భారతరత్న మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’ ప్రదానోత్సవానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరవుతారని మోదీ తెలిపారు. సెప్టెంబర్ 5 (ఉపాధ్యాయ దినోత్సవం)ను దృష్టిలో పెట్టుకుని టీచర్-స్టూడెంట్ సంబంధంపైన, గంగానది ప్రక్షాళన, స్వచ్ఛ్ భారత్ అభియాన్, పర్యావరణ అనుకూల గణేశ్ విగ్రహాల అంశాలపైనా మోదీ మాట్లాడారు. పొరుగుదేశాలతో బలమైన, సత్సంబంధాలను నెలకొల్పేందుకే భారత్ మొదట్నుంచీ ప్రయత్నిస్తోందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల కారణంగా జరిగిన నష్టంపైనా ప్రధాని మాట్లాడారు. స్థానిక అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించారని.. బాధితులకు కేంద్రం సహాయం చేస్తోందన్నారు.

 కర్ఫ్యూ కోసం ఏమీ చేయలేదు?
 ప్రధాని మన్ కీబాత్ కార్యక్రమంపై కాంగ్రెస్, జేడీయూలు నిప్పులు చెరిగాయి. ‘కేవలం 5శాతం మంది వల్లే సమస్యలు అనుకుంటే.. కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎందుకు ఎత్తేయటం లేదు? ఎందుకు కశ్మీర్లో పరిస్థితిని అదుపుచేయడం లేదు?’ అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ట్వీటర్లో విమర్శించారు.  
 
 కన్నడ విద్యార్థినికి ప్రశంసలు
 ఇంట్లో శౌచాలయ నిర్మాణం కోసం తల్లిదండ్రులను ఎదురించటంతోపాటు.. ఉపవాస దీక్ష చేసి అనుకున్నది సాధించి, గ్రామంలో చైతన్యం తెచ్చిన కన్నడ విద్యార్థిని మల్లమ్మ (16)ను ప్రధాని మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా ఢాణాపుర గ్రామానికి చెందిన మల్లమ్మ ఇంట్లో దీక్ష చేయటంతో ఈ విషయం గ్రామ పెద్దలవరకు వెళ్లిందని.. వారు ఏడు రోజుల్లోనే రూ.8వేల ఖర్చుతో మల్లమ్మ ఇంట్లో శౌచాలయాన్ని నిర్మించారని ప్రధాని ప్రశంసించారు. అటు, ఓ 84 ఏళ్ల రిటైర్డ్ ఉపాధ్యాయురాలు.. ఎల్పీజీ సబ్సిడీని వదులుకోవటంతోపాటు.. కట్టెలపొయ్యిపై వంట చేసుకుంటున్న ఓ మహిళకు రూ.50వేలు ఇవ్వటంపైనా ప్రశంసలు కురిపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement