CM Mehbooba Mufti
-
రంజాన్‌లో మిలటరీ ఆపరేషన్లు నిలిపివేత
న్యూఢిల్లీ/శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసంలో జమ్మూకశ్మీర్‌లో మిలటరీ ఆపరేషన్లను నిలిపివేయాలని భద్రతాబలగాలను కేంద్రం ఆదేశించింది. రంజాన్‌ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవేళ భద్రతాబలగాలపై దాడి జరిగితే తిప్పికొట్టేందుకు, ప్రజల్ని రక్షించే పూర్తి స్వేచ్ఛ బలగాలకు ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయాన్ని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీకి తెలియజేసినట్లు పేర్కొన్నారు. అర్థంలేని హింసతో ఇస్లాంకు చెడ్డపేరు తీసుకొస్తున్న ఉగ్రమూకలను ఏకాకి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రంజాన్‌ను ముస్లింలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుపుకునేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ శనివారం కశ్మీర్లో పర్యటించనున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
‘మెహబూబా ముఫ్తీ వైదొలగాలి’
శ్రీనగర్: కథువా ఘటనకు బాధ్యత వహిస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత, మాజీ మంత్రి లాల్‌సింగ్ డిమాండ్ చేశారు. కథువా కేసులో నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో బీజేపీ మంత్రులు లాల్ సింగ్, చంద్ర ప్రకాశ్ గంగలు పాల్గొన్నారని బీజేపీ అధిష్టానం వారిచే రాజీనామా చేయించిన విషయం తెలిసిందే. అయితే తాము కేవలం రాష్ట్రంలో శాంతి నెలకొల్పడం కోసమే రాజీనామా చేశామన్నారు.అసిఫా అదృశ్యమైన ఏడు రోజుల తర్వాత ఆమె మృత దేహన్ని గుర్తించారని, ఇది పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. హోం శాఖ బాధ్యతలు మెహబూబా వద్దే ఉన్నాయని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘సీఎంజీ.. హోం శాఖ మీ వద్దే ఉంది.. రాష్ట్రంలో లైంగిక దాడులు జరిగితే ఏం చేస్తున్నారు. మేం ఏ తప్పు చేయలేదు. మేం కూడా అసిఫా శ్రేయోభిలాషులమే. అసిఫాకు న్యాయం జరగాల’ని లాల్ సింగ్ అన్నారు. -
బీజేపీ మంత్రుల రాజీనామాల ఆమోదం
శ్రీనగర్: కఠువా హత్యాచార కేసులో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ మంత్రుల రాజీనామాలను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆదివారం ఆమోదించి గవర్నర్‌కు పంపారు. కఠువాలో చిన్నారి అసిఫాపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో బీజేపీ మంత్రులు లాల్ సింగ్, చంద్ర ప్రకాశ్ గంగలు పాల్గొనడంతో పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వారిద్దరి చేత బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించింది. సీబీఐ విచారణ జరపాలి.. కఠువా హత్యాచార కేసులో సీబీఐ చేత విచారణ జరిపించాలని నిందితుల కుటుంబం డిమాండ్ చేసింది. క్రైం బ్రాంచ్ విచారణపై తమకు నమ్మకం లేదని, తమ తండ్రి, సోదరుడు దోషులని తేలితే ఉరి తీయాలని నిందితుడు సంజీరామ్ కూతుళ్లు చెప్పారు. ఈ కేసు విషయమై జమ్మూ హైకోర్టు, కఠువా న్యాయవాదులు చేస్తున్న సమ్మెను విరమించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఆదేశించింది. -
అనాథలతో దీపావళి జరుపుకున్న సీఎం
సాక్షి, ఆర్ఎస్ పుర (కశ్మీర్) : జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గురువారం అనాథ పిల్లలతో కలిసి కశ్మీర్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇండో-పాకిస్తాన్ సరిహద్దులోని ఆర్ఎస్ పురా సెక్టార్లో ఉన్న ఆనాథాశ్రయంలోని పిల్లలతో మెహబూబా ముప్తీ పండగ పూట సరదాగా గడిపారు. చిన్నారుకు మిఠాయి పంచడమేకాక వారికి తానే స్వయంగా తినిపించారు. చిన్నారుల భజన పాటలకు సీఎం పరవశించిపోయారు. గత ఏడాది కూడా సీఎం మెహబూబా ముఫ్తి అనాథ చిన్నారులతోనే దీపావళి వేడుకులను జరుపుకోవడం గమనార్హం. -
ఆర్టికల్ 35ఏ.. మరో తేనెతుట్టె!
జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్–370 అక్కడి శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులు ప్రసాదించే అధికరణం– 35ఏ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రత్యేక హక్కులను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం త్వరలో విచారించనుంది. జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆర్టికల్–35ఏకు అనుకూలంగా మాట్లాడుతుండగా కొందరు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై చర్చకు తెరతీస్తే అది తేనెతుట్టెను కదిపినట్టేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమిటీ అధికరణం 35ఏ? జమ్మూ కశ్మీర్లో ‘శాశ్వత నివాసులు’ అన్న పదాన్ని నిర్వచించడానికి, వారికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పించేందుకు ఆ రాష్ట్ర శాసనసభకు ఆర్టికల్ 35ఏ అధికారం ఇస్తోంది. రాజ్యాంగ సవరణ లేకుండా, పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే 1954లో ఈ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దీన్ని ఉపయోగించి శాసనసభ శాశ్వత నివాసులను నిర్ధారించింది. దాని ప్రకారం 1911కు ముందు జమ్మూ కశ్మీర్లో జన్మించిన లేదా స్థిరపడిన వారు లేదా అంతకు కనీసం పదేళ్ల ముందు ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొన్నవారు మాత్రమే శాశ్వత నివాసులు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌కు వచ్చిన వారెవరూ అక్కడ స్థిరాస్తులు కొనకూడదు. ప్రభుత్వోద్యోగాలు చేయకూడదు. ఉపకార వేతనాలు, ప్రభుత్వం నుంచి సాయం పొందేందుకు అనర్హులు. ఓటు వేయకూడదు. ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అలాగే శాశ్వత నివాసి అయిన కశ్మీరీ అమ్మాయి, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమెకున్న హక్కులు కూడా హరించుకుపోతాయి. కానీ కశ్మీరీ అబ్బాయిల విషయంలో ఇది వర్తించదు. అయితే 2002 అక్టోబరులో జమ్మూ కశ్మీర్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ, శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు కూడా హక్కులు ఉంటాయనీ, అయితే వారి పిల్లలకు మాత్రం ఏ హక్కులూ ఉండవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్... ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించకుండా, పార్లమెంటులో చర్చించకుండా అధికరణం 35ఏను రాజ్యాంగంలో చేర్చారనీ, కాబట్టి అది చెల్లదని ఢిల్లీకి చెందిన ‘వి ద సిటిజన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ 2014లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అలాగే ఆర్టికల్ 35ఏ తమ పిల్లలకు ఓటు హక్కు లేకుండా చేస్తోందని ఇద్దరు కశ్మీరీ మహిళలు గత నెలలో సుప్రీంను ఆశ్రయించారు. ఎన్డీఏ ప్రభుత్వం దీనిపై కోర్టులో అఫిడవిట్ వేయ కుండా, ఈ అంశంపై విస్తృతచర్చ జరగడంతోపాటు దీనిని రాజ్యాంగ ధర్మాసనం తేల్చాలని కోరుకోవడం మరింత వేడి పుట్టిస్తోంది. ఆర్టికల్ 35ఏపై చర్చ అంటే దాదాపుగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370పై చర్చగానే భావించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హక్కు లను ప్రశ్నించకుండా అధికరణం 35ఏ చెల్లుబాటును, రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రశ్నించలేమని చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ అంటున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వారు నరకంలో కాలిపోతారు!!
శ్రీనగర్: శ్రీనగర్‌లోని ఓ ప్రముఖ మసీదు ఎదుట డీఎస్పీని కొట్టిచంపిన ఘటనపై రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. జామియ మసీదు ఎదుట డీఎస్పీ ఆయూబ్ పండిత్‌ను ఓ అల్లరి మూక దారుణంగా కొట్టిచంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అత్యంత సిగ్గుచేటు అని సీఎం మెహబూబా ముఫ్తీ ఖండించగా.. ప్రతిపక్ష నేత, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయూబ్ పండిట్‌ను కొట్టిచంపిన తీరు అధిక్షేపణీయమన్నారు. 'డీఎస్పీ పండిత్‌ను కొట్టిచంపిన వారు తమ పాపాలకు నరకంలో కాలిపోదురుగాక' అంటూ ఆయన ట్వీట్ చేశారు. వేర్పాటువాద నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ కూడా ఈ ఘటనను తప్పుబట్టారు. 'నౌహాట్టాలో చోటుచేసుకున్న అనాగరిక చర్య తీవ్రంగా కలిచివేస్తోంది. మూక హింస, బహిరంగంగా కొట్టిచంపడం మన విలువలకు, మతానికి వ్యతిరేకం. ప్రభుత్వ కూర్రత్వం మన మానవత్వాన్ని, విలువలను హరించకుండా మనం చూడాలి' అని ఆయన అన్నారు. చదవండి: మసీదు ముందు డీఎస్పీని కొట్టిచంపేశారు! -
ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు: సీఎం
శ్రీనగర్: శ్రీనగర్‌లోని జామియా మసీదు వద్ద డీఎస్పీని ఒక అల్లరి మూక కొట్టిచంపిన ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతకన్నా సిగ్గులేని చర్య మరొకటి ఉండదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే జమ్మూకశ్మీర్ పోలీసులు ఉత్తమ సేవలు అందిస్తున్నారని, సొంతవారన్న స్పృహతో ప్రజలను ఎదుర్కోవడంలో ఎంతో నిగ్రహం పాటిస్తున్నారని, అయినా ఇలాంటి దారుణానికి పాల్పడటం బాధాకరమని ఆమె అన్నారు. మూక దాడిలో అమరుడైన డీఎస్పీ మహమ్మద్ ఆయూబ్ పండిట్‌కు ఆమె నివాళులర్పించారు. చదవండి: మసీదు ముందు డీఎస్పీని కొట్టిచంపేశారు! -
‘కశ్మీర్’కు ప్రేమ మంత్రం
-
‘కశ్మీర్’కు ప్రేమ మంత్రం
- కశ్మీర్లో పిల్లలను రెచ్చగొట్టి రాళ్లేయిస్తున్నారు - జీఎస్టీ కోసం అన్ని పార్టీలు ఏకమవటం శుభపరిణామం - పర్యావరణ అనుకూల గణపతిని వాడండి - మన్ కీ బాత్‌లో పేర్కొన్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ: కశ్మీరీలకు చేరువయ్యేందుకు ఐకమత్యం, ప్రేమలే ప్రధాన మార్గాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోయలో అమాయకులైన పిల్లలను కూడా హింసలో భాగం చేస్తున్న వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం సందర్భంగా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. లోయలో జరుగుతున్న అల్లర్లలో ప్రాణాలు కోల్పేయే యువకుడైనా.. భద్రతా సిబ్బంది అయినా మనవాళ్లేనన్న విషయం మరిచిపోవద్దన్నారు. ఈ విషయం ప్రధాని నుంచి గ్రామసేవకుడి వరకు అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అమాయక యువతను, చిన్నపిల్లలను రెచ్చగొట్టి రాళ్లేయిస్తున్నవారంతా.. ఒక రోజు ఈ చిన్నారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో సమావేశంలో మూడు అంశాల ఫార్ములాపై చర్చించిన నేపథ్యంలోనే నేటి మన్‌కీ బాత్‌లో ఈ అంశాలను మోదీ స్పృశించారు. కశ్మీర్లో అస్థిరతకు ముగింపు పలికేందుకు అఖిలపక్షంతో సమావేశమై.. వారినుంచి తీసుకున్న సలహాలతో.. ‘ఏకత’, ‘మమత’ ద్వారానే సమస్య పరిష్కారమని తనకు అర్థమైందన్నారు. లోయలో ప్రజలకు మేమున్నామనే సందేశాన్నివ్వటం ద్వారా ప్రపంచానికి, వేర్పాటువాదులకు స్పష్టమైన సంకేతాన్నివ్వాలని అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. దీంతోపాటు ప్రతిష్టాత్మక జీఎస్టీ బిల్లు ఆమోదం పొందటంలోనూ అన్ని రాజకీయ పార్టీల సహకారం మరువలేనిదన్నారు. రాజకీయంగా బద్ధవిరోధులైనా.. దేశం కోసం అందరూ ఒకటవటం శుభపరిణామమన్నారు. దీంతోపాటు సెప్టెంబర్ 4న భారతరత్న మదర్ థెరిసాకు ‘సెయింట్‌హుడ్’ ప్రదానోత్సవానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరవుతారని మోదీ తెలిపారు. సెప్టెంబర్ 5 (ఉపాధ్యాయ దినోత్సవం)ను దృష్టిలో పెట్టుకుని టీచర్-స్టూడెంట్ సంబంధంపైన, గంగానది ప్రక్షాళన, స్వచ్ఛ్ భారత్ అభియాన్, పర్యావరణ అనుకూల గణేశ్ విగ్రహాల అంశాలపైనా మోదీ మాట్లాడారు. పొరుగుదేశాలతో బలమైన, సత్సంబంధాలను నెలకొల్పేందుకే భారత్ మొదట్నుంచీ ప్రయత్నిస్తోందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల కారణంగా జరిగిన నష్టంపైనా ప్రధాని మాట్లాడారు. స్థానిక అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించారని.. బాధితులకు కేంద్రం సహాయం చేస్తోందన్నారు. కర్ఫ్యూ కోసం ఏమీ చేయలేదు? ప్రధాని మన్ కీబాత్ కార్యక్రమంపై కాంగ్రెస్, జేడీయూలు నిప్పులు చెరిగాయి. ‘కేవలం 5శాతం మంది వల్లే సమస్యలు అనుకుంటే.. కశ్మీర్లో కర్ఫ్యూ ఎందుకు ఎత్తేయటం లేదు? ఎందుకు కశ్మీర్లో పరిస్థితిని అదుపుచేయడం లేదు?’ అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ట్వీటర్లో విమర్శించారు. కన్నడ విద్యార్థినికి ప్రశంసలు ఇంట్లో శౌచాలయ నిర్మాణం కోసం తల్లిదండ్రులను ఎదురించటంతోపాటు.. ఉపవాస దీక్ష చేసి అనుకున్నది సాధించి, గ్రామంలో చైతన్యం తెచ్చిన కన్నడ విద్యార్థిని మల్లమ్మ (16)ను ప్రధాని మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా ఢాణాపుర గ్రామానికి చెందిన మల్లమ్మ ఇంట్లో దీక్ష చేయటంతో ఈ విషయం గ్రామ పెద్దలవరకు వెళ్లిందని.. వారు ఏడు రోజుల్లోనే రూ.8వేల ఖర్చుతో మల్లమ్మ ఇంట్లో శౌచాలయాన్ని నిర్మించారని ప్రధాని ప్రశంసించారు. అటు, ఓ 84 ఏళ్ల రిటైర్డ్ ఉపాధ్యాయురాలు.. ఎల్పీజీ సబ్సిడీని వదులుకోవటంతోపాటు.. కట్టెలపొయ్యిపై వంట చేసుకుంటున్న ఓ మహిళకు రూ.50వేలు ఇవ్వటంపైనా ప్రశంసలు కురిపించారు. -
కశ్మీర్ శాంతికి మూడు సూత్రాల ప్రణాళిక
ప్రధాని మోదీకి వివరించిన మెహబూబా న్యూఢిల్లీ: కశ్మీర్లో శాంతి పునరుద్ధరణకు మూడు సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీ సమర్పించారు. కశ్మీర్‌కు చెందిన అన్ని వర్గాలతో చర్చలు నిర్వహించాలని అందులో కోరారు. కశ్మీర్లో హింసపై మొదటిసారి మోదీతో ఆమె శనివారం గంటపాటు భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నిరసనకారుల ఆందోళనలు, ఆకాంక్షల పరిష్కారానికి తనకొక అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తిచేశారు. కశ్మీర్ లోయలో పోలీస్ స్టేషన్లు, ఆర్మీ శిబిరాలపై యువత దాడులు చేసేలా ప్రోత్సహిస్తున్న వారికి మద్దతును పాక్ ఆపాలన్నారు. ‘ 2002-2005 మధ్య వాజ్‌పేయ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన కశ్మీర్‌పై సయోధ్య, పరిష్కార పక్రియను పునరుద్ధరించాలి. సయోధ్య, పరిష్కార ప్రక్రియకు ప్రాణం పోయాలి. కశ్మీర్ ప్రజలు విశ్వసించే వ్యక్తులతో ఒక విభాగాన్ని ఏర్పాటుచేయండి. అప్పుడే ఢిల్లీలో వారు చెప్పేది ప్రజలకు చేరుతుంది. పాక్ వెళ్లాలనే సాహస నిర్ణయం తీసుకున్న మోదీపై నాకు నమ్మకముంది’ అని మెహబూబా చెప్పారు. పార్టీలు విభేదాల్ని పక్కన పెట్టాలి శాంతిని కోరుతున్న వర్గాల్ని చేరువవడమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు అన్ని పార్టీల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ‘సామాన్యుల ప్రాణాలు కాపాడేందుకు హురియత్ నేతలు సహా అన్ని పార్టీలు విభేదాలు పక్కనపెట్టి ముందుకు రావాలి. ప్రధాని మోదీ లాహోర్ పర్యటన, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇస్లామాబాద్‌లో పర్యటించిన సమయంలో సయోధ్య కోసం లభించిన సువర్ణావకాశాన్ని పాక్ జారవిడుచుకుంది’ అని మెహబూబా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీర్‌పై ఐరాస తీర్మానానికి చోటులేదన్న పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ విధానాన్ని పాటించాలని సూచించారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ వాస్తవాల నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం వేర్పాటు వాదులతో పాటు, పాకిస్తాన్‌కు చర్చల్లో జోక్యం కల్పించాలని కార్యాచరణ ప్రణాళికలో మోహబూబా సూచించినట్లు సమాచారం. ఆగని అల్లర్లు కశ్మీర్లో కొనసాగుతున్న హింసలో క్షతగాత్రుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిరసనకారులు, భద్రతా బలగాలకు మధ్య తాజాగా జరిగిన ఘర్షణలో 25 మంది గాయపడ్డారు. నెలన్నర రోజులుగా కొనసాగుతున్న హింసాగ్నిలో మృతుల సంఖ్య 68కి పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. శనివారం సంగమ్ వద్ద ఝీలం నది నుంచి షానవాజ్ అనే యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.