తెన్నరసుకు యువజన పగ్గాలు
సాక్షి, చెన్నై:డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఎంకే స్టాలిన్ తప్పుకోనున్నారు. తన మద్దతు దారుడు తంగం తెన్నరసును ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డీఎంకేకు యువజన విభాగం వెన్నెముకలాంటిది. ఈ విభాగాన్ని డీఎంకే అధినేత ఎం కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఏర్పాటు చేశారు. ఈ విభాగం ఆవిర్భావ కాలం నాటి నుంచి ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్టీని యువ రక్తంతో నింపే విధంగా ప్రక్షాళన పర్వం సాగుతోంది.
యువజన విభాగంలోని సీనియర్లను పార్టీ సేవలకు వినియోగించుకునేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధం అయ్యారు. అదే సమయంలో, పార్టీ కోశాధికారిగా, యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా జోడు పదవుల్లో ఉన్న స్టాలిన్ త్వరలో పార్టీ పరంగా కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఆయన జోడు పదవులను అంటి పెట్టుకుని స్వారీ చేయడం కష్టతరం అవుతుంది. దీంతో యువజన పగ్గాలను పక్కన పెట్టి, పార్టీ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు స్టాలిన్ సిద్ధం అయ్యారు. ఈ దృష్ట్యా, పార్టీకి అనుబంధంగా వెన్నెముకగా ఉన్న యువజన విభాగాన్ని తన మద్దతుదారుడికి కట్టబెట్టేందుకు స్టాలిన్ వ్యూహ రచన చేసి ఉన్నారు.
తంగం తెన్నరసు : పార్టీ ప్రక్షాళన కమిటీలో కీలక భూమిక పోషిస్తున్న తంగం తెన్నరసును ఆ పదవికి ఎంపిక చేయడానికి నిర్ణయించినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. తంగం తెన్నరసు తనకు సన్నిహితుడు కావడంతో, యువజన విభాగం బలోపేతానికి శ్రమించ గలడన్న నిర్ణయానికి వచ్చి ఆయన్ను ఆ విభాగం ప్రధాన కార్యదర్శి పదవికి అర్హుడిగా స్టాలిన్ ఎంపిక చేయడం గమనార్హం. లండన్ నుంచి రాగానే, ఆ పదవి నుంచి తప్పుకునే స్టాలిన్, బాధ్యతల్ని తంగం తెన్నరసుకు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు అన్నా అరివాళయం వర్గాలు పేర్కొంటున్నాయి. అధినేత ఎం కరుణానిధి ఆదేశాల మేరకు ఆ పదవి నుంచి తప్పుకునేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్నట్టు అరివాళయంలో ప్రచారం సాగుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ ఏ విధంగా తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీ సారథ్యాన్ని బీజేపీ ప్రకటించిందో, అదే తరహాలో తదుపరి రాష్ట్రంలో స్టాలిన్‌ను అందలం ఎక్కించేందుకు కరుణానిధి నిర్ణయం తీసుకునేసినట్టుగా ప్రచారం సాగుతోంది.