భోపాల్ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన కొన్ని గంటల తర్వాత బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే భార్యకు శుక్రవారం మధ్యాహ్నం అస్వస్థతగా ఉండడంతో ఆమె వైద్య సిబ్బందిని ఇంటికి పిలిచి.. ఇద్దరి రక్త నమూనాలను ఇచ్చారు. వీరిద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు రాత్రికే వైద్యులు తెలిపారు.
కాగా, ఎన్నికలు జరిగిన మరుసటి రోజే ఎమ్మెల్యేకు కరోనా వైరస్ నిర్థారణ కావడంతో మిగతా ఎమ్మెల్యే అప్రమత్తమయ్యారు. ఆయనను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు కరోనా నిర్థారణ టెస్టుల కోసం ఆస్పత్రులకు వెళ్లారు. ఇక ఎమ్మెల్యేకు కరోనా నిర్థారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే ఎవరెవరినీ కలిశాడు.. ఎక్కడెక్కడ తిరిగాడు అనే అంశాలపై దృష్టి సారించినట్లు వైద్యాధికారులు తెలిపారు. (చదవండి : రాజాసింగ్‌ను వెంటాడుతున్న కరోనా భయం)
మధ్యప్రదేశ్ లో కరోనా సోకిన రెండో ప్రజాప్రతినిధిగా బీజేపీ ఎమ్మెల్యే నిలిచారు. ఇప్పటికే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన పీపీఈ సూట్ ధరించి రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశారు. కాగా, రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. బీజేపీ రెండు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందింది. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 11,500 మంది కరోనా బారిన పడ్డారు. (చదవండి : స్మార్ట్‌ఫోన్‌తో కరోనాను గుర్తించవచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment