జీతం రూ.1,200.. కానీ కళ్లు చెదిరే కోటీశ్వరుడు
భోపాల్: అతడు నెల రోజులుపాటు కష్టపడితే అందుకు ప్రతిఫలంగా యజమాని చెల్లించేది రూ.1,200. కానీ అనూహ్యంగా అతడు కోట్లాధిపతి అయ్యాడు. కాదు కాదు.. అతడు కోటీశ్వరుడని ప్రభుత్వ అధికారులు తేల్చారు. అది కూడా అక్రమంగా సంపాధించిందని బయటపెట్టారు. లోకాయుక్త అధికారులు అతడి ఇంటిపై దాడిచేసిన తర్వాత గానీ ఈ విషయం లోకానికి తెలియలేదు. సురేశ్ ప్రసాద్ పాండే అనే వ్యక్తి మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో ఓ చిన్న దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు.
అతడి నెల జీతం రూ.1200. అయితే, అతడి వద్ద అక్రమ ఆస్తులు చాలా ఉన్నాయని స్థానిక లోకాయుక్త అధికారులకు సమాచారం అందడంతో అనూహ్యంగా వారు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిజంగానే అతడి వద్ద కోట్ల విలువ చేసిన ఆస్తులు ఉన్నట్లు స్థిర, చర ఆస్తుల పత్రాలు లభించాయి. వీటితోపాటు ఒక బొలేరో, ఆల్టో కార్లను, యాక్టివా, హోండా షైన్ బైక్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడి సంవత్సర సంపాధన కంటే 200 రెట్లు ఆస్తులు గుర్తించామని అధికారులు వెల్లడించారు. పాండే, అతడి కుమారుడు, భార్య పేరిట మొత్తం 8 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.