
సాక్షి, చెన్నై: నీటిపై ఇంత నిర్లక్ష్యమా..చెరువుల్లో చేపట్టిన పూడికతీత పనులపై నివేదిక సమర్పించండి’ అంటూ మద్రాసు హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆగ్రహానికి తగినట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి సహాయం కూడా ప్రభుత్వాలదే బాధ్యతని తప్పుపట్టారు. ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు న్యాయస్థానం విమర్శలతో సీఎం ఎడపాడి బుధవారం మంచినీటి సమస్యలపై చర్చించేందుకు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా చెన్నైలో నీటి కరువు ఎంత చెప్పినా తక్కువే అనేలా మారింది. తాగునీటి కష్టాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. మంగళవారం నాటి సమాచారం ప్రకారం చెన్నై దాహార్తిని తీర్చే 3231 మిలియన్ క్యూబిక్ అడుగులు నీటి నిల్వ సామర్థ్యం కలిగిన పూండి జలాశయం నోరెళ్లబెట్టేసింది. అలాగే చోళవరం, చెంబరబాక్కం, రెడ్‌హిల్స్ చెరువులు సైతం పూండితోపాటూ నెలరోజుల కిందటే పూర్తిగా ఎండిపోయాయి.
చెన్నై దాహం కోసం రోజుకు 830 మిలియన్ లీటర్లు అవసరం కాగా 525 మిలియన్ లీటర్లను మాత్రమే సరఫరా చేయగలగుతున్నారు. 1465 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటి నిల్వసామర్ద్యం కలిగిన వీరాణం జలాశయం 530 మిలియన్ క్యూబిక్ అడుగుల నీటి నిల్వతో ఒకింత దాహాన్ని తీరుస్తోంది. అలాగే సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే నెమ్మలి, మీంజూరులోని నీటి నిర్లవణీకరణ కేంద్రాలు 180 మిలియన్ లీటర్ల నీటితో, మరికొన్ని తాగునీటి సరఫరాల శాఖ బావులు ఆదుకుంటున్నాయి. చెన్నై తాగునీటి అవసరాలను తీర్చే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాల్లో కండలేరు జలాశయం నుంచి ఏడాదికి 12 టీఎంసీల నీరు అందాల్సి ఉంది. అయితే కండలేరు సైతం కేవలం 4.5 టీఎంసీలతో నిస్సహాయస్థితికి చేరుకుంది. తాగునీటి సరఫరా శాఖ 1005 టాంకర్ల ద్వారా నగరంలో నీటిని సరఫరా చేస్తున్నా చాలడంలేదు. 2000 సంవత్సరం తరువాత చెన్నై ఇంతటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోంది. నగరంలోని కొన్ని ప్రయివేటు పాఠశాలలు నీటి ఇబ్బందులతో రెండురోజులు సెలవులు ప్రకటించాయి. చెన్నై నగరంలో 15 ఉమెన్ మాన్షన్లను మూసివేయగా పురుషుల మాన్షన్లలో నీటి సరఫరా వేళలను బోర్డులపై ప్రకటించి ఆచరించాలని ఆదేశించారు. నగరంలోని ఆసుపత్రులు నీరులేక అల్లాడుతున్నాయి. నగరంలోని మెట్రోరైల్వేస్టేషన్లలో టాయిలెట్లకు తాళాలు వేశారు.
హైకోర్టు అక్షింతలు:
నీటి వనరులను కాపాడడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లాల వారీగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వేలూరులో మంచినీటిలో మురుగునీరు కలవడాన్ని నివారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మణికుమార్, సుబ్రమణ్యప్రసాద్ ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలమేరకు గ్రేటర్ మెట్రోవాటర్, డ్రైనేజ్ బోర్డు చీఫ్ ఇంజినీర్ అర్ముగం మంగళవారం బదులు పిటిషన్ దాఖలు చేశారు. 2017లో కనీసస్థాయిలో వర్షాలు లేని కారణంగా చెన్నైకి తాగునీట అవసరాలను తీర్చే చెరువులు, జలాశయాలు ఎండిపోయాయని, ఈ కారణంగా రోజుకు 830 మిలియన్ లీటర్లకు బదులుగా 525 మిలియన్ల మాత్రమే సరఫరా చేస్తున్నామని తెలిపారు.
తాగునీటికి మరో చిన్నారి బలి:
పుదుక్కోట్టై జిల్లాలో మంచినీటి కోసం తవ్విన గుంతలో పడి మూడేళ్ల చిన్నారి బలైన దారుణం చోటుచేసుకుంది. వెత్తూరు గ్రామంలో నీటి కోసం స్థానికులు లోతైన గుంటను తవ్వి అందులో ఊరుతున్న నీటిని తోడుకుంటున్నారు. ఇటీవల వర్షం పడడంతో ఆ గుంట నిండిపోయింది. అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్, వెన్నిల దంపతుల మూడేళ్ల చిన్నారి భవతారిణి నీటి గుంటకు పక్కనే ఉండే అవ్వ ఇంటికి వెళ్లి తిరిగి తన ఇంటికి వెళుతూ గుంటలో పడిపోయింది. ఎంతకూ చిన్నారి తిరిగి రాకపోవడంతో అనుమానించిన తల్లిదండ్రులు గుంటలోని నీటిని తోడిచూడగా అందులో శవమై పడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment