చెన్నై : గాడ్సే వ్యాఖ్యలపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ నేత కమల్ హాసన్‌కు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తమిళనాడులోని అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే భారత్‌లో తొలి హిందూ ఉగ్రవాది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఓ హిందూ సంస్థకు చెందిన కార్యకర్త ఫిర్యాదు మేరకు కరూర్ జిల్లాలోని అరవకురిచ్చి పోలీసులు కమల్ హాసన్‌పై కేసు నమోదు చేశారు. మతపరమైన విశ్వాసాలను ప్రేరేపించడం, భిన్న గ్రూపులకు చెందిన వారి మధ్య శత్రుత్వాన్ని పెంచడం వంటి అభియోగాలపై కమల్ హాసన్‌పై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రజల్లో తనకున్న మంచిపేరును చెడగొట్టేందుకే తనపై కక్షసాధింపునకు దిగుతున్నారని కమల్ హాసన్ ఆరోపించారు.
గాడ్సేపై తన వ్యాఖ్యలను కమల్ సమర్ధించుకుంటూ గాంధీ హత్య కేసు విచారణ సందర్భంగా దేశ విభజనకు కారణమైన గాంధీని హిందువైన తాను చంపానని గాడ్సే స్వయంగా అంగీకరించారని చెప్పుకొచ్చారు. తాను గాంధీని ఎందుకు చంపాను అనే పుస్తకంలో సైతం గాడ్సే ఇదే విషయం చెప్పారని అన్నారు. కాగా, ముందస్తు బెయిల్ మంజూరుకు అవసరమైన షరతులకు లోబడతానని కమల్ న్యాయస్దానంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment