సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. వైరస్ బారినపడివారు క్రమంగా కోలుకుంటున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. 52,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 35,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 15,266 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1783 మంది మృతిచెందారు. మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున పెరగడం అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో వైరస్ విజృంభిస్తోంది. (కరోనా.. 53 వేలకు చేరువలో కేసులు)
మహారాష్ట్రలో గురువారం ఉదయం నాటికి 16758 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 651 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనాతో 34 మంది మరణించారు. ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికవాడల్లో ఒకటైన ధారవిలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. అక్కడ కొత్తగా 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారవిలో మొత్తం కేసుల సంఖ్య 745కి చేరింది. ఇక కరోనా క్లిష్ట సమయంలోనూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకూ కరోనా సోకడం ఆందోళన కరంగా ఉంది. ఇప్పటికే చాలామంది పోలీసులు వైరస్ బారినపడగా.. వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. (త్వరలో ప్రజా రవాణాకు పచ్చజెండా)
ఇక ప్రధానమంత్రి స్వరాష్ట్రమైన గుజరాజత్‌లోనూ వైరస్ తీవ్ర ప్రతాపం చూపుతోంది. ఇప్పటి వరకు అక్కడ 6625 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 399 మంది ప్రాణాలను కోల్పోయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లోనూ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment