మూకుమ్మడి దాడి
- రైలు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఒక్కటైన ప్రతిపక్షాలు
- టికెట్ లేకుండా సీఎస్టీ నుంచి ఠాణేకు కాంగ్రెస్ నాయకుల ప్రయాణం
- రైలు టికెట్ తీసుకోవద్దని ప్రయాణికులకు ఎన్సీపీ పిలుపు
- కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన ప్రజాసంఘాలు
సాక్షి, ముంబై: రైలు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలతోపాటు ప్రజాసంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాయి. సామాన్య ప్రజలపై భారం మోపే నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో నగరంలోని సీఎస్టీ, ఠాణే, బోరివలి తదితర రైల్వే స్టేషన్లు మార్మోగాయి. రాజకీయ పార్టీలకు ప్రజాసంఘాలు కూడా తోడవడంతో ఆందోళన తారాస్థాయికి చేరింది.
ఎంపీసీసీ ఆధ్వర్యంలో...
మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) ఆధ్వర్యంలో సోమవారం వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎస్టీలో నిర్వహించిన ఈ ఆందోళనలో వేలమంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ‘ఈసారి మోడీ సర్కార్’(ఇస్‌బార్ మోడీ సర్కార్) అంటూ ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన ప్రచారానికి వ్యంగ్యాన్ని జోడిస్తూ.. ‘ఈసారి ఖరీదైన సర్కార్’(ఇస్‌బార్ మెహెంగీ సర్కార్) అంటూ రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ సీఎస్టీ రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు.
ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆందోళనలో పార్టీ నేతలతోపాటు గల్లీస్థాయి నేతలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సీఎస్టీ నుంచి ఠాణే వరకు టికెట్ లేకుండానే ప్రయాణించి నిరసన తెలిపారు. దారి పొడవునా ఎన్డీయే ప్రభుత్వానికి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఠాణే చేరుకున్న తర్వాత అక్కడి ైరె ల్వే స్టేషన్లో నినాదాలు మరింత జోరందుకున్నాయి.
ఎన్సీపీ ఆధ్వర్యంలో..
రైల్వేచార్జీల పెంపుపై ఎన్సీపీ కూడా ఆందోళనకు దిగింది. బోరివలి ైరైల్వేస్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు తమదైన రీతిలో ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చిపోయే రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా రైల్వే పోలీసులు వద్దని వారించడంతో వెనక్కు తగ్గారు. సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే రైల్‌రోకోను చేపట్టడంలేదని ఆ పార్టీ నేతలు మీడియాకు తెలిపారు.
టికెట్ లేకుండా ప్రయాణించాలి: జితేంద్ర
రైల్వేచార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రయాణికులందరూ టికెట్ లేకుండా ప్రయాణించాలని ఎన్సీపీ నాయకుడు జితేంద్ర అవ్హాడ్ పిలుపునిచ్చారు. ఔరంగాబాద్‌లో జరిగిన ‘కాఫీ విత్ స్టూడెంట్స్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలను మోడీ ప్రభుత్వం నమ్మించి, మోసగించిందన్నారు.
కోర్టును ఆశ్రయించిన ప్రయాణికుల సంఘాలు
రైల్వే చార్జీల పెంపును సవాలుచేస్తూ ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించారు. చార్జీల పెంపుతో ముంబై సబర్బన్ ప్రయాణికులపై భారీ ఎత్తున భారం పడనుందని, వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ముంబై హై కోర్టులో ప్రయాణికుల సంఘం కూడా మరో పిటిషన్ వేసింది. దీనిపై నేడు విచారణ జరగనున్నట్టు తెలిసింది.