సాక్షి, ముంబయి : తమ పంటలకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించకపోవడంతో తమకు కారుణ్య మరణాన్ని అనుమతించాలని మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాకు చెందిన 91 మంది రైతులు కోరారు. గవర్నర్, సబ్‌డివిజనల్ మేజిస్ర్టేట్‌లకు ఈ మేరకు వారు లేఖ రాశారు. తమ పంటలకు సరైన ధర లేదని, జాతీయ రహదారి కోసం ప్రభుత్వం తమ భూములను సేకరించి సరైన పరిహారం చెల్లించలేదని లేఖలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేనందున తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని అభ్యర్థించారు.
ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ జీవించే అవకాశం ఎంతమాత్రం లేని రోగులకు వారు కోరితే కారుణ్య మరణాన్ని అనుమతించవచ్చని ఇటీవల సుప్రీం కోర్టు పేర్కొన్న విషయం విదితమే. అయితే రైతుల దీనస్థితికి వారి లేఖలు అద్దం పడుతున్నాయని, చనిపోయేందుకు వారు అనుమతి కోరుతున్నారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ, విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని, స్వామినాధన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర రైతులు ఇటీవల ముంబయి వరకూ మహాప్రదర్శన చేపట్టారు. రైతుల డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment