సల్మాన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకు..!
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను హిట్ అండ్ రన్ కేసు వీడని నీడలా వెంటాడుతోంది. ఈ కేసులో సల్మాన్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. సల్మాన్ నిర్దోషిగా ప్రకటిస్తూ గతంలో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం హిట్ అండ్ రన్ కేసులో బొంబాయి హైకోర్టు సల్మాన్‌ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై ఉన్న అన్ని అభియోగాలనూ తోసిపుచ్చింది. అంతకుముందు సెషన్ కోర్టు ఆయనను దోషిగా ప్రకటించి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. దీనిపై ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. 2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ఒక బార్‌లో మద్యం సేవించి, వాహనంలో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ సల్మాన్ బాంద్రా శివార్లలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపై దూసుకెళ్లాడని, ఆ ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.