
ముంబై : కరోనా వైరస్ కేసులతో వణికిపోతున్న ముంబై , పుణే నగరాల్లో సైన్యాన్ని రంగంలోకి దించినట్టు వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికల్లో సాగుతున్న ప్రచారాన్ని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తోసిపుచ్చారు. ఈ దుష్ర్పచారాన్ని చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముంబై, పుణే నగరాల్లో 10 రోజుల పాటు కర్ఫ్యూను విధించేందుకు ఆర్మీని మోహరించారని వాట్సాప్‌తో పాటు సోషల్ మీడియా వేదికలపై వదంతులు వ్యాప్తిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ వార్తలు నిరాధారమైనవని, వీటిని ప్రచారం చేసిన వారిపై చర్యలు చేపట్టడం ప్రారంభమైందని మంత్రి ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి కట్టడికి ముంబై, పుణే నగరాల్లో ఆర్మీని దించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తడంతో ఈ మేరకు మంత్రి వివరణ ఇచ్చారు. సైబర్ నేరగాళ్లగా కఠిన చర్యలు చేపట్టాలని సైబర్ సెల్ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. టిక్‌టాక్, ఫేస్‌బుక్, ట్విటర్ సహా ఇతర సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేసేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment