గాంధీతత్వమే భవితవ్యం | Mahatma Gandhi on his 150th birth anniversary special | Sakshi
Sakshi News home page

గాంధీతత్వమే భవితవ్యం

Published Tue, Oct 2 2018 5:05 AM | Last Updated on Tue, Oct 2 2018 8:07 AM

Mahatma Gandhi on his 150th birth anniversary special - Sakshi

గాంధీ పుట్టిన భారతంలో గాంధీతత్వం మనుగడ ఇప్పుడొక ప్రశ్నార్ధకం. బ్రిటీష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అన్నీ తానై పోరు సాగించాడు మహాత్ముడు. అహింసా పోరాటంతో స్వతంత్రం సాధించాడు. అందుకే ‘జాతిపిత’ అయ్యాడు. మరి గాంధీయిజం ఇప్పటి కాలంలో ఎంతవరకు మనగలుగుతోంది? భారత సమాజంలో గాంధీతత్వం ఏ మేరకు ఆచరణలో వుంది? గాంధీ చెప్పిన అహింస, స్వావలంబన, సర్వోదయ సూత్రాలను ఎంతవరకు పాటిస్తున్నాం? ప్రపంచవ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలతో స్ఫూర్తి పొందిన వివిధ దేశాల నేతలు గాంధీయిజం గురించి ఏం చెబుతున్నారు? పరిశీలిద్దాం.

గాంధీ అంటే  ఓవైపు దేశ స్వతంత్ర పోరాటం సాగిస్తూనే, మరోవైపు శాంతి సామరస్యాల కోసం ఉద్యమించిన రాజకీయవేత్త. సూక్ష్మబుద్ధి గల నేత. మార్పు కోసం సాగే పోరులో నీతి, అహింస, మైనార్టీల ప్రజాస్వామిక హక్కులు చాలా ముఖ్యమనేది గాంధీ ఉద్దేశం. ఈ విషయంలో  అష్టాంగ మార్గాన్ని అనుసరించిన బుద్ధుడిని ఆయన తలపుకు తెస్తాడు.  ఈ విషయాలను మనం గ్రహించగలిగితే, గాంధీతత్వ సారాంశాన్ని గమనంలోకి తీసుకోగలిగితే, గాంధీయిజానికి వర్తమాన ప్రపంచంలో కాలం చెల్లిందనే అభిప్రాయం తప్పని గ్రహించగలుగుతాం.  అహింస విషయంలో ప్రపంచానికి ఒక చక్కని అవగాహన కల్పించినవాడు గాంధీజీ. ఆయన పేరు జాతి – మత – దేశాల హద్దుల ఆవలికి చేరింది. 21వ శతాబ్దంలో ఆయన మాట ఒక ప్రవచనమయ్యింది. అహింసాయుత సిద్ధాంతాన్ని ఆచరించి, మహాన్నత మనవతావాదానికి కట్టుబడిన గాంధీని ఇప్పుడు ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకుంటోంది.

ధనస్వామ్య – వినియోగ సంస్కృతి రాజ్యమేలుతున్న సమాజానికి గాంధీ బోధనల అవసరం ఏముంది?  ఈ  ఆధునిక ప్రపంచానికి గాంధీ ప్రాముఖ్యత ఏమటి? ఆయన విజయ రహస్యాలేమిటి? వంటి ప్రశ్నలు ఎవరిలోనైనా తలెత్తవచ్చు. ఈ సందర్భంలో గాంధీని ఒక దేదీప్యమానమైన దీపంగా భావించే  టిబెటన్‌ ఆధ్మాత్మిక వేత్త దలైలామా మాటల్ని గుర్తు చేసుకోవచ్చు. అనేకమంది పురాతన కాలపు భారతీయ గురువులు  అహింసను ఒక తత్వశాస్త్రంలా బోధించారు. అది కేవలం తాత్విక అవగాహనకే పరిమితైంది  కానీ మహాత్ముడు – ఈ 21 వ శతాబ్దంలో – ఒక అధునాతన దృక్పథం ఇచ్చాడు. ఆధునిక రాజకీయాల్లో అహింస అనే ఒక గొప్ప తత్వాన్ని ఆచరించి చూపాడు. అందుకే విజయవంతమైనాడు’ అంటారు దలైలామా. అదే గాంధీ గొప్పతనం. అదే గాంధీ ఆధునిక ప్రపంచానికి ఇస్తున్న సందేశం. గత శతాబ్దంలో – ప్రపంచంలోని కొన్ని దేశాలు దమన నీతితో కూడిన విధానాల్లో మార్పులు చేసుకోవడం వెనుక వున్నది గాంధీతత్వమే.

గాంధీజీ విజయ రహస్యాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తే – విశ్వాసం – కార్యాచరణ – ప్రజాకర్షణ అనే మూడింటిని మనం గమనించగలం. ఇవి ఆయన జీవితంలోని మూడు ముఖ్య అంశాలు. సాధారణ ప్రజలతో తన మనోభావాలను అసాధారణ రీతిలో పంచుకోవడం ఆయన విజయ రహస్యాల్లో మరొకటి. ఆయన  ప్రజలకు నిజమైన నాయకుడు. వారికి స్నేహితుడు. దలైలామా నుంచి డెస్మండ్‌ టుటూ  వరకూ.. ఆఫ్రికన్‌ – అమెరికన్‌ పౌరహక్కుల నేత మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ నుంచి దక్షిణాఫ్రికా స్వతంత్ర పోరాటయోధుడు నెల్సన్‌ మండేలా వరకూ.. గాంధీ నుంచి రకరకాలుగా స్ఫూర్తి పొందిన వారే.

దారుణ చట్టాలను ఉల్లంఘించిన  మనిషి సంతోషంగా జైలు కెళ్లాలని భావించిన గాంధీ నుంచి ఎంతగానో ఉత్తేజం పొందాడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌.  శాంతియుతంగానే బ్రిటీష్‌ పాలనను ప్రతిఘటించాలని గాంధీ కోరాడు.  జనం ఊరేగింపులు తీశారు.  వీధుల్లో బైఠాయించారు. సమ్మెలు చేశారు. విదేశీ వస్తువుల్ని బహిష్కరించారు. కానీ హింసను ఎప్పుడూ ఆశ్రయించలేదు. లూథర్‌ కింగ్‌ చెప్పినట్టు – ఆయన జీవించాడు. ఆలోచించాడు. ఆచరించాడు.  మానవతా దృక్పథంతో  ఉత్తేజపరిచాడు. తన ‘జీవితానికి  ఒక స్పూర్తి’ ఇచ్చిన మహానీయుణ్ణి గాంధీలో దర్శించాడు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా. సాధారణ ప్రజలను అసాధారణ చర్యలకు పురిగొల్పగల ఒక గొప్ప పరివర్తనకారుణ్ణి గాంధీలో చూశారాయన.

అనేక ఏళ్ల పాటు గృహ నిర్బంధంలో వున్న బర్మా నాయకురాలు  అంగ్‌ సాన్‌ సూకీ ..గాంధీ నుంచి గొప్ప స్ఫూర్తి పొందారు. శాంతి సిద్ధాంతానికి – సయోధ్యకు ఆచరణ రూపం ఎలా ఇవ్వాలో గాంధీ నుంచే ఆమె నేర్చుకున్నారు. దారుణమైన రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో విజయం సాధించిన సూకీ.. మహాత్ముని బోధనలే తనకు విజయాన్ని సమకూర్చాయంటారు. గాంధీయుజం  ఆధునిక యుగంలో సజీవంగా, చురుకుగా వుందని వీరిæ మాటలు చెబుతున్నాయి. గాంధీ స్ఫూర్తినిచ్చాడు. ప్రపంచంలోని అనేకమంది రాజకీయ – సామాజిక – మత నాయకులకు స్ఫూర్తినిస్తూనే ఉంటాడు. అమెరికన్‌ జానపద గాయకుడు –  మానవ హక్కుల కార్యకర్త జోన్‌ బాజ్‌ కావచ్చు లేదా అహింసా మార్గంలో నడుస్తున్న పాలస్తీనా నేత ముబారక్‌ అవద్‌ లాంటి వారు కావచ్చు.. వీరంతా తమ పోరాటంలో గాంధీ నుంచి ఉత్తేజం పొందుతున్న వారే.

మంచితనానికి జ్ఞానాన్నీ, ధైర్యాన్నీ, దృఢ విశ్వాసాన్నీ తప్పక తోడు చేసుకోవాలని చెప్పాడు గాంధీ. సిద్ధాంతాల్లేని రాజకీయం, పని కల్పించలేని సంపద,  నీతి లేని వాణిజ్యం, శీలం లేని విద్య,  అంతరాత్మ అంటని ఆనందం, మానవత్వం లేని శాస్త్రం, త్యాగానికి సిద్ధపడని ఆరాధన –వీటన్నింటినీ సామాజిక పాపాలు అన్నాడు గాంధీ. కాబట్టి ఇవాళ గాంధీతత్వం మరింత అవసరం. భారత్‌ లాంటి దేశాల్లో గాంధీతత్వానికి కఠినమైన పరీక్షలు ఎదురవుతున్నాయంటే అందుకు ఆ సిద్ధాంత బలహీనతలు కారణం కాదు. చెడుతో పోరాడగల  ధైర్యమూ, దృఢ విశ్వాసమూ ఉన్న బలమైన నాయకులు లేకపోవడమే అసలు కారణం.

బాపూజీ అడుగు జాడలు..!
నేటి నుంచి దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు మొదలవుతున్న సందర్భంలో ఆయన జీవనయానంలో ముఖ్య ఘట్టాలు...

►1869 అక్టోబర్‌ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో (సుధామపురి, కథియావాడ్‌) జననం
►1883లో పోర్‌బందర్‌లో 14 ఏళ్ల వయసులో  కస్తూర్భాతో బాల్య వివాహం
►1888 సెప్టెంబర్‌ 4న  లా చదువు కోసం లండన్‌ పయనం
►1891 జనవరి 12న లాపరీక్షలో ఉత్తీర్ణత
►1891 జూన్‌ 6న భారత్‌కు తిరుగుప్రయాణం
►1892 మే 24న హైకోర్టు బారిస్టర్‌గా బొంబాయిలో ప్రాక్టీస్‌ ప్రారంభం
► 1893 ఏప్రిల్‌లో పోర్‌బందర్‌ సంస్థ తరఫున వాదించేందుకు దక్షిణాఫ్రికాకు పయనం
►1893 జూన్‌లో ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌ ఉన్నా కూడా పీటర్‌మారిట్జ్‌బర్గ్‌ స్టేషన్లో మరో కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాల్సిందిగా గాంధీజీని అధికారులు ఆదేశించారు. అందుకు ఆయన నిరాకరించడంతో పోలీస్‌ కానిస్టేబుల్‌ను పిలిచి   బలవంతంగా ప్లాట్‌ఫామ్‌పైకి నెట్టివేస్తారు. ఆ రోజు రాత్రంతా కూడా చలిలో వణుకుతూ వెయిటింగ్‌రూంలోనే ఆయన గడపాల్సి వచ్చింది.
►1894 ఆగస్టు 22న వర్ణవివక్షతపై పోరాడేందుకు నాటల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు
►1899 అక్టోబర్‌ 18న తన సేవలు అవసరమైతే మళ్లీ దక్షిణాఫ్రికాకు వస్తానంటూ భారత్‌కు తిరుగుపయనం
►1902 నవంబర్‌ 20న భారతీయుల నుంచి వత్తిడి పెరగడంతో మళ్లీ దక్షిణాప్రికాకు పయనం
►1906 సెప్టెంబర్‌లో సత్యగ్రహ (పాసివ్‌ రెసిస్టెన్స్‌ మూవ్‌మెంట్‌) ఉద్యమం ప్రారంభం
►1902 నవంబర్‌ 13–22 మధ్యలో దక్షిణాఫ్రికా నుంచి లండన్‌కు వెళ్లే దారిలో గుజరాతీలో ‘హింద్‌ స్వరాజ్‌’ లిఖించారు
►1915 జనవరి 9న భారత్‌కు తిరిగి రాక
►1915 మే 25న అహ్మదాబాద్‌లోని కొచ్రెబ్‌లో సత్యగ్రాహ ఆశ్రమం స్థాపస
►1917 ఏప్రిల్‌లో చంపారన్‌ సత్యాగ్రాహం
►1918లో అహ్మదాబాద్‌ మిల్లు వర్కర్లు,  ఖేడా రైతుల సత్యాగ్రాహం
►1919 ఏప్రిల్‌ 13న అమృతసర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ బహిరంగసభలో నరమేథం చోటుచేసుకోవడంతో ప్రజలంతా శాంతితో మెలగాలని విజ్ఞప్తి
►1919 అక్టోబర్‌ 8న గాంధీజీ సంపాదకత్వంలో యంగ్‌ఇండియా మొదటిసంచిక విడుదల
►1920–21 ఖిలాఫత్, సహాయనిరాకరణ ఉద్యమం మొదలు
►1922 ఫిబ్రవరి 5న యూపీ గోరఖ్‌పూర్‌లోని చౌరీ చౌరాలో చోటుచేసుకున్న హింసాత్మకఘటనలతో ఈ ఉద్యమం  ఉపసంహరణ
►1924 సెప్టెంబర్‌ 17న హిందు–ముస్లింల ఐక్యత కోసం 21 రోజుల నిరాహారదీక్ష ప్రారంభం
►1928 డిసెంబర్‌లో కలకత్తా కాంగ్రెస్‌కు హాజరు. 31న  ముసాయిదా  భారత రాజ్యాంగానికి ఆమోదం
►1929 డిసెంబర్‌లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో సంపూర్ణ స్వాతంత్రంపై గాంధీజీ తీర్మానం ఆమోదం. వెంటనే చట్టసభలు బహిష్కరించాలని నిర్ణయం
►1930 జనవరి 26న భారత్‌ వ్యాప్తంగా స్వాతంత్య్రదినం వాగ్దానం చేసిన ప్రజలు
►1930 ఫిబ్రవరి 19న అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ద్వారా ‘పౌర ఉల్లంఘన కార్యక్రమం–శాసనోల్లంఘన’ తీర్మానం ఆమోదం
►1930 మార్చి 12న 78 మంది ఆశ్రమవాసులతో కలిసి ఉప్పు తయారీ చట్టాన్ని  ఉల్లంఘిస్తూ  చరిత్రాత్మక దండియాత్ర ప్రారంభం 
►1931 మార్చి 5న గాంధీ–ఇర్విన్‌ ఒప్పంద ప్రకటన
►1931 మార్చి 29న  నిర్ణయాత్మక  రౌండ్‌ బేబుల్‌ సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌ పయనం
►1931 డిసెంబర్‌ 5న మళ్లీ సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయం
►1932 జనవరి 4న హరిజనుల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ నిరాహారదీక్ష ప్రారంభం
►1933 మే 8న హరిజనుల స్థితిగతులు మెరుగుపరచాలంటూ 21 రోజుల నిరాహారదీక్ష మొదలు
►1933 జులై 31 వ్యక్తిగత శాసనోల్లంఘన మొదలు
►1934 సెప్టెంబర్‌ 17న కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేయబోతున్నట్ఠు ప్రకటన
►1936లో వార్థాలో సేవాగ్రామ్‌ ఆశ్రమం స్థాపన
►1939 మార్చి 3న రాజ్‌కోఠ్‌లో  ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభం. 7న విరమణ
►1940 అక్టోబర్‌ 15న ఆచార్య వినోభా భావేతో కలిసి యుద్ధవ్యతిరేక వ్యక్తిగత సత్యాగ్రాహం ప్రారంభం
►1942 జనవరి 15న తన రాజకీయవారసుడిగా పండిట్‌  జవహర్‌లాల్‌ నెహ్రు పేరు ప్రకటన
►1942 మార్చి 30న తొలిసారి ‘క్విట్‌ ఇండియా’ అలోచన, ఆ తర్వాత  కొన్నిరోజులకు బొంబాయిలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో క్విట్‌ఇండియా తీర్మానం ఆమోదం
►1944 ఫిబ్రవరి 22న కస్తూర్భా మరణం, 
►1945  జనవరి–జులై మధ్యలో సిమ్లా కాన్ఫరెన్స్‌
►1946 అక్టోబర్‌ 10న తూర్పు బెంగాల్‌లోని నోవాఖాలి, ఇతర జిల్లాల్లో పెద్దెత్తున  హింసాత్మక ఘటనలు
►1946 నవంబర్‌ 6న నోవాఖాలికి పయనం
►1947 జనవరి–డిసెంబర్‌ల మధ్యలో బెంగాల్, బిహార్, ఢిల్లీలలోని ప్రభావిత ప్రాంతాల పర్యటన
►1947 ఆగస్టు 15న దేశానికి రెండుగా విభజించడంపై కలకత్తాలో  నిరాహారదీక్ష
►1948 జనవరి 13న మతఘర్షణలకు నిరసనగా ఢిల్లీలో నిరాహారదీక్ష ప్రారంభం
►1948 జనవరి 27న  ఇకపై రాజకీయసంస్థగా కాంగ్రెస్‌పార్టీ కొనసాగకూడదని రాతపూర్వకంగా వెల్లడి
►1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనల సందర్భంగా నాథూరాం గాడ్సే తుపాకి గుళ్లకు నేలకొరిగిన గాంధీజీ


 మహాత్మా గాంధీజీ ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల్లో ఒకరు. దక్షిణాఫ్రికా ఈ స్థాయికి రావడానికి గాంధీ ఆలోచనలు ఎంతగానో తోడ్పడ్డాయి. వర్ణ వివక్ష నిర్మూలనలో గాంధీ బోధనలు దిక్సూచిలా నిలిచాయి.
– నెల్సన్‌ మండేలా, దక్షిణాఫ్రికా దివంగత అధ్యక్షుడు.

మనకు యేసు క్రీస్తు లక్ష్యాన్ని ఇస్తే.. జాతి విముక్తికి మహాత్మా గాంధీ అహింస అనే ఆయుధం ద్వారా మెలకువలు నేర్పించారు.
– మార్టిన్‌ లూథర్‌కింగ్, అమెరికా పౌరహక్కుల నేత.

భవిష్యత్తు తరాలకు గాంధీజీ మార్గదర్శకుడు. మా తరంలో గాంధీ అత్యంత గొప్ప ఉన్నత ఆలోచనలు గల రాజకీయ నాయకుడు.
– ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్, ప్రఖ్యాత శాస్త్రవేత్త.  

మనిషి స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకున్న గొప్ప మానవుడు గాంధీజీ. ఆయన జీవితం నాకు ఆదర్శవంతం.
– దలైలామా, ప్రముఖ బౌద్ధ గురువు.

మహాత్మా గాంధీ నిజమైన హీరో. నాకు స్ఫూర్తి ప్రదాత.
– బరాక్‌ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement