పౌర అణు ఒప్పందంలో మేలిమలుపు!
భారత్, అమెరికాల మధ్య ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పౌర అణు ఒప్పందం ఖరారైపోయింది. ఇందులో అత్యంత ముఖ్యమైన 'ట్రాకింగ్ క్లాజు'ను తొలగించేందుకు అమెరికా అంగీకరించడం ఇందులోని ప్రధానాంశం. భారత అణు ఉపయోగాన్ని తాము పరిశీలించబోమని అమెరికా చెప్పడం మన దేశంలోని చాలామందిని సంతృప్తి పరిచే అవకాశం ఉందని అంటున్నారు. ఒబామా తన విశేషాధికారాలను ఉపయోగించుకుని ఈ క్లాజును తొలగించినట్లు తెలిసింది. వేరే దేశం నుంచి తెచ్చుకున్న అణు సామగ్రిని అమెరికా కంపెనీలు సరఫరా చేసిన రియాక్టర్లలో ఎలా ఉపయోగిస్తున్నారో కూడా అమెరికా ట్రాక్ చేయబోదు.
ఆదివారం సాయంత్రం జరిగే సంయుక్త విలేకరుల సమావేశంలో దీన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు అనేక అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ, అధ్యక్షుడు ఒబామాల మధ్య ఇంకా పలు అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకోవడం, రక్షణ రంగ సహకారం లాంటి విషయాలపైనా ఒప్పందాలు కుదరొచ్చని అంటున్నారు.