ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్లకు ఆధార్ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీః భారత్‌లో జరిగే ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల రిజిస్ర్టేషన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నిపుణుల కమిటీ సూచించింది.ఎన్‌ఆర్‌ఐల పెళ్లిళ్ల వివాదాలు, ఇతర సంబంధిత అంశాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఇది అవసరమని కమిటీ పేర్కొంది. ఎన్‌ఆర్‌ఐ భర్తలు వదిలివేస్తున్న మహిళల హక్కుల పరిరక్షణ, గృహహింస, కట్న వేధింపుల బాధితులకు సహాయపడేందుకు ఇది దోహదపడుతుందని కమిటీ వెల్లడించింది. ఈ మేరకు నిపుణుల కమిటీ గత నెల 30న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది.
మరోవైపు నిందితుల అప్పగింత కోసం భారత్ పలు దేశాలతో చేసుకున్న ఒప్పందాల్లో కట్నం వేధింపులను కూడా చేర్చాలని కమిటీ కీలక సూచన చేసింది. ఇక ఎన్‌ఆర్‌ఐలు, భారత విదేశీ పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులకు ఆధార్ నమోదుకు అవసరమైన విధానంపై యూఐడీఏఐ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం భారత జాతీయులతో పాటు సరైన వీసాలున్న విదేశీయులు ఆధార్ నమోదు చేసుకోవచ్చు.