ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూర్ : తమ కుమార్తెలకు విదేశీ సంబంధాల కోసం తల్లితండ్రులు ఉబలాటపడుతుంటే ఎన్‌ఆర్‌ఐ పెళ్ళిళ్లు అమ్మాయిలకు కన్నీళ్లు మిగుల్చుతున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. సగటున ప్రతి ఎనిమిది నిమిషాలకు ఎన్‌ఆర్‌ఐను వివాహం చేసుకున్న ఓ మహిళ సాయం కోసం తమవారికి ఫోన్ చేస్తున్నట్టు గణాంకాలు వెల్లడించాయి. భర్త వదిలి వేయడమో, శారీరక వేధింపులకు గురిచేయడమో..వంటి పలు కారణాలతో తాము తిరిగివస్తామంటూ పేరెంట్స్‌ను వేడుకుంటున్నట్టు తేలింది.
దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు జనవరి 1, 2015 నుంచి నవంబర్ 30, 2017 మధ్య ఈ తరహా ఫిర్యాదులు 3,328 వరకూ అందాయి. ఈ ఫిర్యాదులు అధికంగా పంజాబ్ నుంచి రాగా ఆ తర్వాతి స్ధానాల్లో ఏపీ, తెలంగాణ, గుజరాత్‌లున్నాయి. ఇక వరకట్న వేధింపులు అధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే వస్తున్నాయని వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఆరతిరావు తెలిపారు. వరకట్న వ్యవస్థ బలంగా ఉన్నా ఏపీ, తెలంగాణలోనే ఈ పరిస్థితి అధికంగా ఉందని చెప్పారు.
ఎన్‌ఆర్‌ఐలు తమ స్వస్థలాలకు వెళ్లి తల్లితండ్రులు చూసిన అమ్మాయిలను పెళ్లిచేసుకుంటున్నారని..అయితే తిరిగి వచ్చిన తర్వాత వారితో కలిసిఉండేందుకు విముఖత చూపుతున్నారని చెప్పారు. అదనపు కట్నం, గొంతెమ్మ కోరికలతో భార్యలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఎన్‌ఆర్‌ఐ సంబంధాలపై భారత తల్లితండ్రులకున్న మోజు కూడా ఈ పరిస్థితికి కారణమని మరికొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment