మోదీ హామీ ఏమైంది?: మల్లిఖార్జున ఖర్గే
న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. నల్లధనం వ్యవహారంపై సభలో ఈరోజు ఆయన చర్చను ప్రారంభించారు. నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తే ఈ దేశంలో ప్రతి వ్యక్తికి 15 లక్షల రూపాయలు ఇవ్వవచ్చని మోదీ అన్న విషయాన్ని గుర్తు చేశారు. నల్లధనాన్ని తీసుకువచ్చి పేదలకు పంచుతామని చెప్పారు. ఇప్పుడు మోదీ ప్రధాన మంత్రి అయ్యారు. నల్లధనాన్ని ఎందుకు తీసుకురావడంలేదని ప్రశ్నించారు.
యుపీఏ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలంతా ఏవేవో ప్రకటనలు చేశారు. తాము కావాలనే నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడంలేదని ఆరోపించారు. కావాలనే దాచినవారి పేర్లు వెల్లడించడంలేదన్నారు. కేసును మూసివేసే ధోరణిలో ఉన్నట్లు ఆనాడు మాట్లాడారు. ఆ మాటలు మాట్లాడినవారిలో ఇప్పుడు చాలామంది మంత్రులయ్యారని చెప్పారు. మరి ఆరు నెలలుగా ప్రభుత్వం ఏం చేస్తోందని ఖర్గే ప్రశ్నించారు. తమకు ఓటు వేస్తే వంద రోజుల్లో నల్లధనాన్ని తీసుకువస్తామని మోదీ చెప్పారన్నారు. ఆ హామీనే నెరవేర్చమని తాము అడుగుతున్నట్లు చెప్పారు. ఇతరులపై ఆధారాలులేని ఆరోపణలు చేసి, నిందలు మోపారని ఖర్గే అన్నారు.
**