
యూపీ రైతుకు మాల్యా దెబ్బ!
ఉత్తరప్రదేశ్ : ఫొటోలో కనిపిస్తున్న ఇతని పేరు సర్దార్ మన్మోహన్ సింగ్. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలోని ఖజూరియా- నిబిరామ్ గ్రామానికి చెందిన రైతు. నాలుగు దశాబ్దాల కిందట పంజాబ్ నుంచి వలసవచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. ఎనిమిది ఎకరాల భూమి ఉంది. దీన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా నందగావ్ బ్రాంచీలో తనఖా పెట్టి కుమారుడి పెళ్లి కోసం మూడు లక్షల అప్పు తీసుకున్నాడు. వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించేశాడు. అయితే గత ఏడాది డిసెంబరులో నందగావ్ బీఓబీ శాఖ ఇతని రెండు ఖాతాలను స్తంభింపజేసింది. విషయం తెలుసుకుందామని బ్యాంకుకు వెళ్లిన మన్మోహన్‌కు మేనేజర్ చెప్పిన సమాధానం విని కళ్లుబైర్లు కమ్మాయి.
కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా తీసుకున్న వేల కోట్ల రుణాలకు మన్మోహన్ పూచీకత్తు ఇచ్చాడని, ఇతని పేరు కింగ్‌ఫిషర్ డెరైక్టర్లు, హామీదారుల జాబితాలో ఉందని మేనేజర్ చెప్పాడు. ఈ మేరకు ముంబైలోని నారీమన్ పాయింట్ రీజినల్ ఆఫీసు నుంచి తమకు సమాచారం వచ్చిందని, మన్మోహన్ ఖాతాలను స్తంభింపజేయాలని లేఖలో కోరారని నందగావ్ మేనేజర్ వివరించాడు. లబోదిబోమన్న మన్మోహన్ ఏడాదికి మూడులక్షలకు మించి ఆదాయం లేని తాను కోట్ల రూపాయల రుణానికి పూచీగా ఉండటమేమిటని మొత్తుకున్నాడు. అసలు తానెప్పుడూ యూపీనే దాటలేదని, మాల్యా ఎవరో ఇటీవల పత్రికల్లో వచ్చేదాకా తనకు తెలియదని వాపోయాడు. ఎక్కడో పొరపాటు జరిగిందని ... తన ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని రాతపూర్వకంగా విన్నవించుకున్నాడు. ఒక ఖాతాలో నాలుగు వేల రూపాయలు, మరోదాంట్లో పన్నెండు వందలు ఉన్నాయని తెలిపాడు. ఇతని పూర్వాపరాలను వివరిస్తూ నారీమన్ పాయింట్ ఆఫీసుకు రాస్తే... ఇటీవలే ఖాతాలను పునరుద్ధరించమని అనుమతి ఇచ్చారట.