దమ్ముంటే రాష్ట్రపతి పాలన పెట్టండి!
మోదీ సర్కార్‌కు మమతా బెనర్జీ సవాల్
కేంద్రం కక్ష సాధిస్తోంది
కోల్‌కతా: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తనపైనా.. తన పార్టీపైనా కక్ష సాధింపునకు పాల్పడుతోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని, బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సవాల్ విసిరారు. శారదా కుంభకోణంలో తృణమూల్ ఎంపీ సృంజోయ్ బోస్ అరెస్ట్ నేపథ్యంలో కేంద్రంపై మమత విరుచుకుపడ్డారు. శనివారమిక్కడ జరిగిన పార్టీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. బీజేపీకి భయపడాల్సిన పనిలేదని, పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను సమైక్యంగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు నోరెత్తకూడదని వారు భావిస్తున్నారని, అందుకే సోనియా కూడా నోరు విప్పడం లేదని, తానంటే భయపడుతున్నారని, తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తమపై దాడి జరిగితే ప్రతిఘటిస్తామని, ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ప్రజల కోసమే తాము పని చేస్తామని, రాజకీయ కక్ష సాధింపులపై తమ పోరాటం ఇప్పుడే ప్రారంభమైందన్నారు. సృంజోయ్ అరెస్ట్‌ను మమత ప్రస్తావిస్తూ.. వాస్తవానికి బీజేపీ తననే లక్ష్యంగా చేసుకుందని, ఢిల్లీలో సెక్యులర్ పార్టీలు ఏర్పాటు చేసిన సదస్సుకు తాను హాజరుకావడమే దీనికి కారణమని ఆరోపించారు. తమ ఎంపీని అరెస్ట్ చేయడం ద్వారా తనపై పగ తీర్చుకున్నారన్నారు. ఇటువంటి వందలు, వేల సదస్సులకు హాజరవుతానని ప్రకటించారు. అల్లర్లకు సంబంధించి అనేక కేసులు ఎదుర్కొంటున్న వారు తమ వైపు ఎలా వేలు చూపిస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశానికి ఇన్‌చార్జిగా చెప్పుకుంటున్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఎన్ని రోజులు దేశంలో ఉన్నారని మోదీని ఉద్దేశించి ప్రశ్నించారు. సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హాను 2జీ కేసు దర్యాప్తు నుంచి తొలగించాలని ఆదేశించాడన్ని ప్రస్తావిస్తూ.. సీబీఐ విశ్వసనీయతను సుప్రీంకోర్టే తప్పుపట్టిందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో చర్చించారు.