
నియంతృత్వం, కిరాతకం
• మమత ధ్వజం.. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ
• పాలుపంచుకున్న ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమ తా బెనర్జీతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్, ఎన్డీఏ భాగస్వామి శివసేన నాయకులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రూ. 500 / 1000 నోట్ల రద్దు తో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేస్తూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. బుధవారం పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లిన ఈ బృందానికి మమత నేతృత్వం వహించారు.
ఆమె వెంట తృణమూల్ ఎంపీలు, ఆప్ ఎంపీ భగవంత్ మన్, శివసేన ఎంపీ హర్సుల్, నేషనల్ కాన్ఫరెన్‌స నేత ఒమర్ అబ్దుల్లా తదితరులున్నారు. రాష్ట్రపతిని కలసిన అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసేలా ఉందన్నారు. ‘సామాన్యుల కష్టాలను రాష్ట్రపతికి వివరించాం. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి, దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయాలని కోరాం’ అని చెప్పారు. దీనికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించి, ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారన్నారు. గురువారం లోక్‌సభలో వారుుదా తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. మోదీ చర్యను నియంతృత్వ, కిరాతక చర్యగా అభివర్ణించారు. సరిపడా నిత్యావసరాలు మార్కెట్‌లో సరఫరా అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. శివసేన ప్రభుత్వ చర్యను సమర్థించినప్పటికీ, పాత నోట్ల మార్పిడికి గడువును మరింత పొడిగించాలని చెప్పింది.