పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, కోల్‌కతా : తనను హతమార్చేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. ‘ నన్ను చంపేందుకు ఓ రాజకీయ పార్టీ సుపారీ ఇచ్చింది..వారు నా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు..వేరే ఇంటిలోకి మారాలని పోలీసులు నాకు సూచించా’రని మమత చెప్పారు. గతంలోనూ తనను హతమార్చేందుకు కుట్ర జరిగిందని ఆమె పేర్కొన్నారు. తాను విశ్వసనీయ సమాచారమే వెల్లడిస్తున్నానని, సదరు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు తక్షణమే తనను ప్రభుత్వ బంగళాలోకి మారాలని కోరారన్నారు. మమతా బెనర్జీ ఇప్పటికీ ఒకే అంతస్తు కలిగిన ఇంటిలో నివసిస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు ప్రధాన సమస్యలను విస్మరించి తనను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా 12,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మత ఘర్షణలు పెచ్చుమీరుతున్నాయని వీటిపై కాంగ్రెస్, సీపీఎంలు కనీసం నిరసన కూడా తెలపడం లేదని విమర్శించారు. బీజేపీ దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తోందని, సీపీఎం, కాంగ్రెస్ సైతం హింసను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు.
ప్రజలు గతంలోనూ రామనవమిని జరుపుకున్నా ఆయుధాలు చేతబట్టలేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దీటుగా ప్రాంతీయ పార్టీలు సైతం బలీయమైన శక్తిగా అవతరించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలో ఫలితాలు హంగ్ అసెంబ్లీ దిశగా ఉంటాయని అంచనా వేశారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment