‘మోదీ ఇంటి ముందు ధర్నా చేస్తా’
కోల్ కతా: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోదీని దించుతామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ప్రజల నోట్ల కష్టాలు తొలగించకుంటే ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. కోల్ కతాతో నిర్వహించిన భారీ ర్యాలీలో మమత పాల్గొన్నారు.
‘దేశం సంక్షోభంలో ఉంది. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేవు. నోట్ల కష్టాలతో 80 మంది మరణించారు. ఇవేమి పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ మొద్ర నిద్ర పోతున్నారు. నగదు రహిత దేశంగా మారాటంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. గ్రామాల్లో చాలా మందికి బ్యాంకు ఖాతాలు లేవు. ఇలాంటి వారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా బతుకుతారు? నోట్ల రద్దుతో దేశంలో అప్రకటిత ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తింది.
ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను ఉసిగొల్పుతున్నారు. ఇలాంటి వాటికి నేను భయపడను. మళ్లీ ఢిల్లీ వెళతాను. నా గళం విన్పిస్తాను. అవసరమైతే ప్రధాని మోదీ ఇంటిముందు ధర్నాకు దిగుతాన’ని హెచ్చరించారు.