నిప్పుతో ఆటలొద్దు
- వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు మమత వార్నింగ్
- శాంతికి భంగం కలిగితే తీవ్ర పరిణామాలు
- ఆయుధ పూజ నిర్వహిస్తాం : వీహెచ్‌పీ
సాక్షి, కోల్‌కతా : దుర్గా నవరాత్రుల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో శాంతికి విఘాతం కల్గిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరికలు జారీ చేశారు. దుర్గా నవరాత్రుల సందర్భంగాఘాయుధ పూజకు నిర్వహిస్తామని ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ వాటి అనుబంధ సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో మమతా బెనర్జీ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అంటే నిప్పుతో ఆటలాడుకోవడమేనని ఆమె స్పష్టం చేశారు. దుర్గా నవరాత్రుల సమయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ముస్లింల పండుగ మెహర్రం కూడా నవరాత్రుల సమయంలో రావడంతో.. ఆమె దుర్గా దేవి విగ్రహాల నిమజ్జన విషయంలో కఠినమైన ఆంక్షలు విధించారు.
ఆయుధ పూజ చేసి తీరుతాం : వీహెచ్‌పీ
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధ పూజను పశ్చిమ బెంగాల్లో నిర్వహించి తీరుతామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్లోని మొత్తం 300 ప్రాంతాల్లో విజయదశమి, ఆయుధ పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వీహెచ్‌పీ తెలిపింది. విజయ దశమి అనే పండుగను.. చెడుమీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకుంటామని వీహెచ్‌పీ కార్యదర్శి సచీంద్రనాథ్ సిన్హా చెప్పారు. వీహెచ్‌పీ యూత్‌వింగ్, భజరంగ్‌దళ్ మహిళా విభాగమైన దుర్గా భవానీ ఇప్పటికే ఆయుధ పూజ గురించి జిల్లాల్లో ప్రచారం మొదలు పెట్టాయని చెప్పారు.