మోదీ చెప్పినా.. ఆగని హత్యలు!
రాంచీ: ‘గోరక్షను అడ్డం పెట్టుకుని ఓ వ్యక్తిని చంపే హక్కుందా? ఇదేనా గోభక్తి? ఇదేనా గోరక్ష?’ అని గోభక్తి పేరుతో జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించి కొన్ని గంటలు గడవక ముందే జార్ఖండ్‌లో ఆ తరహా ఘటన కలకలం రేపింది.
గిరిదిహ్ జిల్లాలోని బిరియబాద్ గ్రామానికి చెందిన డెయిరీ ఓనర్ అలీముద్దీన్ అలియాస్ అస్గర్ అన్సారి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం మారుతీవ్యాన్‌ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా రామ్‌ఘర్ జిల్లాలోని బజర్‌తండ్ వద్ద అన్సారిపై కొంతమంది దుండగులు దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అన్సారీని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మాంసం వ్యాపారం చేసే అన్సారీని పథకం ప్రకారం హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయని సీనియర్ పోలీస్ అధికారి ఆర్‌కే మాలిక్ వెల్లడించారు. దాడి సమయంలో అన్సారీ బీఫ్ తీసుకెళ్తున్నాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉందన్నాడు. జార్ఖండ్‌లోని గిరిదర్ జిల్లాలో సోమవారం ఉస్మాన్ అన్సారీ అనే వ్యక్తిపై సైతం ఇలాంటి దాడి జరిగిన విషయం తెలిసిందే.