
రాంచీ : చిలుక చాలా అందమైన రంగుల పక్షి. దాన్ని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. దాని పలుకులు వింటే నవ్వోస్తుంది. అది కనిపిస్తే పట్టుకోవడానికి ట్రై చేస్తాం.. పారిపోతే వదిలేస్తాం. కానీ మనోడు మాత్రం చిలుక కోసం ఏకంగా 40 ఫీట్ల పొడవు ఉన్న చెట్టు ఎక్కి.. చేతిని విరగ్గొట్టుకొని.. చివరకు చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా బయటపడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని గధ్వాకు చెందిన బబ్లూ అనే వ్యక్తికి గత మంగళవారం ఉదయం ఓ చిలుక కనిపించింది. దాన్ని చూసి ముచ్చటపడ్డ బబ్లూ.. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలనుకున్నాడు. కానీ ఆ చిలుక దగ్గర్లో ఉన్న చెట్టు తొర్రలోకి తుర్రుమని పారిపోయింది. వెంటనే మనోడు 40 అడుగుల ఎత్తు ఉన్న చెట్టును చకచకా ఎక్కేశాడు. చిలుక కోసం తొర్రలో చెయ్యి దూర్చాడు. కానీ ఆ తొర్ర నుంచి అతగాడి చెయ్యి రాలేదు. దీంతో గట్టిగా చేతిని లాగే ప్రయత్నం చేశాడు. బబ్లూ ఒక్కసారిగా చేతిని లాగడంతో బ్యాలెన్స్ తప్పి కొమ్మ నుంచి కిందకు జారాడు. అదృష్టం కొద్ది కిందపడకుండా కొమ్మ భాగాన్ని పట్టుకొని గాల్లో వేలాడుతూ కన్పించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రేన్ సహాయంతో బబ్లూను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. చెట్టు తొర్ర నుంచి చేతిని లాగే క్రమంలో చేతి మణికట్టు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు చిలుక కోసం చిన్నోడు పడ్డ కష్టాలు చూసి స్థానికులు తెగ నవ్వుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment