
సాక్షి, చెన్నై: డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, మద్యం తాగి వాహనం నడిపినా.. సీటు బెల్టు ధరించకుండా కారు నడిపినా జరిమానా విధించటం సర్వసాధారణంగా జరిగేదే. కానీ, తమిళనాడులో మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోకుండా మోటారు బైక్‌ను నడిపాడంటూ పోలీసులు ఓ యువకునికి జరిమానా విధించేశారు. ఈ ఘటన పలువురిని విస్మయపరిచింది.
తంజావూరులో సోమవారం పోలీసులు వాహన తనిఖీలు జరిపారు. ఆ సమయంలో తంజావూరుకు చెందిన పాండ్యరాజన్ మోటార్ బైక్‌పై అటుగా వచ్చాడు. అతన్ని ఆపిన పోలీసులు సీటు బెల్డ్ ధరించకుండా వస్తున్నావంటూ జరిమానా విధించారు. తనది మోటారుసైకిల్ సీటు బెల్ట్ ఎలా ఉంటుందని అతడు మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పాండ్యరాజ్ మంగళవారం తంజావూరు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
రోజువారీ కూలి పనులు చేసుకునే తాను మోటారు సైకిల్‌పై వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని.. హెల్మెట్ ధరించటంతోపాటు తన వద్ద ఉన్న ఒరిజినల్ పత్రాలన్నింటినీ చూపించినా పోలీసులు మాత్రం.. సీటు బెల్ట్ ధరించలేదని చెప్పి రూ.500 జరిమానా వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారి శక్తివేల్ సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.