ముంబై : అడవిలో వెళ్తున్న ఇద్దరు స్నేహితులను ఓ ఎలుగు బంటి తరమడం.. దాంతో ఒకరు చెట్టునెక్కి ప్రాణాలు రక్షించుకోవడం. మరొకరు అలా చెట్టునెక్కలేక కిందపడిపోయి చనిపోయినట్టు నటించడం. దాంతో ఆ ఎలుగు అతను చనిపోయాడని పొరబడి అక్కడ నుంచి వెళ్లిపోవడం. ఈ కథ అందరికీ తెలిసే ఉంటుంది. తాజాగా మహారాష్ట్రలోని బంధార జిల్లాలో కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. పులి చేతిలో చావు అంచుల దాక వెళ్లిన ఓ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడ్డాడు. దాని తాలూకు వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది. ఆ వీడియో ప్రకారం..
(చదవండి : కుక్కకు పులి వేషం వేసి వాటిని తరిమేశాడు..!)
ఊర్లోకి చొరబడ్డ ఓ పులిని గ్రామస్తులంతా వెంటబడి తరుముతున్నారు. అది భయంతో పరుగులు పెడుతూ సమీపంలోని పంట పొలాల్లోకి చేరింది. అంతలోనే అనూహ్యంగా వెనక్కి మళ్లి ఓ వ్యక్తిపై దాడికి యత్నించింది. అతన్ని కింద పడేసి.. ఛాతీ భాగాన్ని నోటితో చీల్చాలని చూసింది. చచ్చాన్రా దేవుడోయ్..! అని భయంతో గుండెలు అదురుతున్నా ఆ వ్యక్తి మాత్రం ధైర్యం కోల్పోలేదు. అంతటి ప్రాణాపాయ స్థితిలోనూ బుద్ధికి పనిచెప్పాడు. ఊపిరి బిగపట్టి చచ్చినట్టు పడున్నాడు. అప్పటికే గ్రామస్తుల అరుపులతో బెదిరిపోయిన పులి.. నోటికి చిక్కిన ‘ఆహారం’ పోతే పోయిందిలే అనుకుంటూ అడవిలోకి పరుగులు పెట్టింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘చచ్చినట్టు నటించడంతో బతికిచచ్చాడు’అని కొందరు సరదా కామెంట్లూ చేస్తున్నారు.
(చదవండి : గొల్లపల్లి అడవిలో పులి సంచారం)
Comments
Please login to add a commentAdd a comment