
పనాజీ: ఉత్తరప్రదేశ్ మంత్రినంటూ నకిలీ పత్రాలతో బురిడీ కొట్టించి పనాజీలోని రాష్ట్ర ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో పదిరోజుల పాటు రాచమర్యాదలు అందుకున్న వ్యక్తిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు గెస్ట్‌హౌస్‌లో మర్యాదలు అందుకున్న మరో నలుగురు అనుచరులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గోవా క్రైమ్ బ్రాంచ్ అధికారి వెల్లడించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పోలీసులను అప్రమత్తం చేయడంతో నిందితుడు సునీల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. సింగ్ పట్టుబడిన సమయానికే 12 రోజుల పాటు అతిధి గృహంలో ఎంచక్కా ఆతిథ్యం స్వీకరించాడు.
నిందితుడు గోవా సీఎం అపాయింట్‌మెంట్‌ను కోరాడని అధికారులు తెలిపారు. యూపీ ప్రభుత్వంలో సహకార శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నానని సంబంధిత పత్రాలు చూపడంతో నిందితుడికి గోవా పోలీసులు వ్యక్తిగత భద్రతాధికారిని కూడా సమకూర్చారని అధికారులు వెల్లడించారు. సింగ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో గోవా పోలీసులకు సీఎం ప్రమోద్ సావంత్ సమాచారం ఇచ్చారు. నిందితుడు గత వారం గోవా సహకార మంత్రి గోవింద్ గవాడేతో కూడా భేటీ అయి సంబంధిత శాఖకు చెందిన పలు అంశాలపై చర్చించాడని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment