లక్నో: వరకట్న వేధింపులు.. అత్తింటి వారి ఆరళ్లు తట్టుకోలేక విడాకులు తీసుకునే వారి గురించి విన్నాము. అయితే ఈ మధ్య కాలంలో చాలా సిల్లీ కారణాలతో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే దంపతులు కూడా ఈ కోవలోకే వస్తారు. ‘ఆహారంలో భాగంగా నా భార్య ప్రతిరోజు కేవలం లడ్డూలు మాత్రమే పెడుతుంది. విడాకులు ఇప్పించండి’ అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మీరట్‌లో చోటు చేసుకుంది.
ఆ వివరాలు.. బాధితుడికి పదేళ్ల క్రితం వివాహమయ్యింది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు బాగానే సాగిన వీరి దాంపత్యంలో ఓ తాంత్రికుడి వల్ల కలతలు రేగాయి. గత కొద్ది కాలంగా బాధితుడు తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడు. దాంతో అతడి భార్య ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. అతని సూచన మేరకు బాధితుడికి ప్రతి రోజు ఉదయం 4, సాయంత్ర నాలుగు చొప్పున లడ్డూలు భోజనంగా పెడుతుంది. ఇక ఇతర ఏ పదార్థాలు ముట్టుకోనివ్వడం లేదు. దాంతో విసిగిపోయిన బాధితుడు, భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అధికారులు వీరిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు. అప్పటికి మనసు మార్చుకోకపోతే.. విడాకులు ఇప్పిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment