లక్నో: వారణాసి పర్యటనలో భాగంగా ఈ నెల 16న ఓ రిక్షా కార్మికుడిని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ రిక్షా కార్మికుడేవరో కాదు.. ఇటీవలే తన బిడ్డ వివాహానికి హాజరు కావాలని మోదీకి పెళ్లి పత్రిక పంపిన మంగల్ కేవత్. అయితే మోదీకి ఆ ఆహ్వానం అందడంతో.. పెళ్లి కుమార్తెకు ఆశీస్సులు తెలుపుతూ ప్రధాని.. కేవత్‌కు లేఖ రాశాడు. ఈ క్రమంలో వారణాసి పర్యటకు వచ్చిన మోదీ తానే స్వయంగా కేవత్‌ను పిలిపించుకుని.. అతని యోగక్షేమాలు అడిగారు. ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు మోదీ.
ఈ సందర్భంగా మంగల్ కేవత్ మాట్లాడుతూ.. తన కుమార్తె పెళ్లి సందర్భంగా మొదటి ఆహ్వానాన్ని ప్రధాని మోదీకి పంపాను. ఢిల్లీలోని పీఎంవో కార్యాలయంలో ఫిబ్రవరి 8వ తేదీన తానే స్వయంగా పెళ్లి పత్రికను ఇచ్చాను. ఆ తర్వాత మోదీ నుంచి ఆశీస్సులు తెలుపుతూ లేఖ వచ్చింది. లేఖను చూసిన వెంటనే తాము ఎంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యాము అని కేవత్ తెలిపాడు. అయితే కేవత్ గంగా నది భక్తుడు. తనకు వచ్చిన ఆదాయంలో కొంత గంగా ప్రక్షాళన కోసం ఖర్చు పెట్టడం విశేషం. ఇక కేవత్ నివాసముంటున్న డోమ్రి గ్రామాన్ని నరేంద్ర మోదీ దత్తత తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment