
ఇంపాల్: మరణించిన తండ్రిని చూడటం కోసం అంజలి హమాంగ్టే(22) స్వగ్రామం కాంగ్‌పోక్పి వచ్చింది. దూరం నుంచే తండ్రి శవపేటికను చూస్తూ ఏడుస్తుంది. తల్లి, తోబుట్టువులు, స్నేహితులు ఎవరు ఆమెను దగ్గరకి తీసుకుని ఓదార్చలేదు. సరిగ్గా మూడు నిమిషాలు గడవగానే ఓ పిలుపు వినిపించింది. వెంటనే అంజలి అక్కడ నుంచి వెళ్లి పోయింది. 3 నిమిషాల్లో వెళ్లడం.. తల్లి సైతం పలకరించకపోవడం వంటివి చూసి ఆమె ఎంత పెద్ద నేరం చేసిందో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అంజలి వచ్చింది క్వారంటైన్ నుంచి. అందుకే ఎవరు ఆమె దగ్గరకి వెళ్లలేదు. ప్రస్తుతం ఈ దృశ్యాలు అందరిని కలచి వేస్తున్నాయి.
గత నెల 25న అంజలి చెన్నై నుంచి శ్రామిక్ రైలులో మణిపూర్ వచ్చింది. అయితే ఆమెతో పాటు ప్రయాణించిన మరో స్త్రీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అంజలి ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తీవ్రమైన అనారోగ్యంతో ఆమె తండ్రి మరణించాడు. కడసారి తండ్రిని చూడటం కోసం వైద్యాధికారుల అనుమతితో.. పీపీఈ కిట్ ధరించి క్వారంటైన్ సెంటర్ నుంచి వచ్చింది అంజలి. అందరికి దూరంగా నిల్చూని.. శవపేటిక మీదుగానే తండ్రిని చూసి.. మూడు నిమిషాల్లో వెనుదిరిగింది.
Comments
Please login to add a commentAdd a comment