పనజి : ఓ రిసార్టు నిర్మాణం విషయమై బాంబే హైకోర్టు- పనాజి ధర్మాసనం గోవా సీఎం మనోహర్ పరీకర్ కుమారుడు అభిజాత్ పరీకర్‌కు నోటీసులు జారీ చేసింది. దక్షిణ గోవాలోని నేత్రావలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సమీపంలో అభిజాత్ నిర్మిస్తున్న రిసార్టు నిర్మాణంపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలైంది. నేత్రావలి పంచాయతీ ఉప సర్పంచి అభిజీత్ దేశాయి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ మహేష్ సోనక్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది.
ఈ క్రమంలో వచ్చే నెల 11నాటికి అభిజాత్ పరీకర్‌తో పాటు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి, అటవీ పరిరక్షణ ముఖ్య కార్యదర్శి ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. కాగా హైడ్‌అవే హాస్పిటాలిటీ ప్రమోటర్‌గా ఉన్న అభిజాత్ నిర్మిస్తున్న రిసార్టు కారణంగా అడవి ధ్వంసం అవుతుందని పేర్కొన్న పిటిషనర్.. ఈ నిర్మాణం అనేక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు.
కాగా సీఎం కుమారుడికి నోటీసులు రావడం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం బంధుప్రీతితో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో... ‘ ఈ ప్రాజెక్టులో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేదు. అభిజాత్ పరీకర్ ఆ భూమిని కొనుగోలు చేశారు. మనోహర్ పరీకర్, ఆయన కుమారుడిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని గోవా బీజేపీ అధ్యక్షుడు వినయ్ టెండుల్కర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment