గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ (పాత చిత్రం)
పణజి: క్యాన్సర్‌తో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆరోగ్యంపై డిప్యూటీ స్పీకర్, బీజేపీ సీనియర్ లీడర్ మైఖేల్ లోబో సోమవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పరీకర్ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఆయన వ్యాధి ఇంకా నయం కాలేదు. దేవుని ఆశిస్సులతోనే ఆయన ఇంకా సీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.’ అని వ్యాఖ్యానించారు. ఆయన పదవిలో నుంచి దిగిపోయినా లేదా కాలం చేసినా గోవాలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనకు దూరంగా ఉన్న పరీకర్ పదవి నుంచి దిగిపోవాలని లోబో గతంలో కూడా డిమాండ్ లేవనెత్తారు. 63 ఏళ్ల పరీకర్ గతేడాది ఫిబ్రవరిలో పాంక్రియాటిక్ క్యాన్సర్ బారినపడ్డారు. తొలుత అమెరికాలో చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. (రాహుల్‌కు పరీకర్ ఘాటు లేఖ)
కాగా, డిల్లీ ఎయిమ్స్ వైద్యులు సీఎం ఆరోగ్యంపై శనివారం బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. వరల్డ్ క్యాన్సర్ డే (ఫిబ్రవరి 4) సందర్భంగా.. ‘మనిషి బుద్ధి బలం చాలా గొప్పది. ఎటువంటి వ్యాధులనైనా తట్టుకొని నిలబడగలిగేలా నడిపిస్తుంది’ అని పరీకర్ ఒక మెసేజ్‌లో పేర్కొన్నారు. కాగా, అనారోగ్యం కారణంగా బాగా చిక్కిపోయిన పరీకర్ గతవారం అసెంబ్లీకి వచ్చారు. ఇదిలాఉండగా బీజేపీ సీనియర్ నేత సుదీన్ ధవాలికర్‌ను సీఎంగా నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బీజీపీ సీనియర్ ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవల పరీకర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. జీఎఫ్‌పీ, ఎంజీపీ, మరో ముగ్గురు స్వతంత్ర్య ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment