న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారి విమర్శించారు. ప్రజలకు నిజంగా మేలు చేయాలని భావిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మెట్రో రైళ్లు, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఈ పథకానికి అయ్యే ఖర్చుతో కేంద్రానికి సంబంధం లేదని, తామే పూర్తి ఖర్చు భరిస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ తీవ్రంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ ఢిల్లీలోని పేద ప్రజలకు ప్రధాని ఆవాస్ యోజన, వైద్య పథకాలు సీఎం అమలు చేయకపోతే, త్వరలోనే బీజేపీ అమలు చేస్తుంది. మీకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదు. ఇటువంటి ప్రకటనలు చేయడం ద్వారా ఇప్పటి నుంచే ఓటర్లను కొనడానికి సీఎం ప్రయత్నాలు మొదలుపెట్టారు అని విమర్శలు గుప్పించారు. కాగా ఈ ఏడాది చివరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment