ఛత్తీస్‌గఢ్‌లో మావోల పంజా | Maoists Chattisgarh claw | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో మావోల పంజా

Published Thu, Apr 10 2014 3:29 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Maoists Chattisgarh claw

ముగ్గురు జవాన్ల మృతి  ఎన్నికలకు ఒక రోజు ముందు దాడులు
 
 చింతూరు,   ఛత్తీస్‌గఢ్‌లోని తొలి దశ ఎన్నికలకు ఒక రోజు ముందు బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు పంజా విసిరారు. బుధవారం రెండు జిల్లాల్లో జవాన్లపై దాడులకు తెగబడ్డారు. బుధవారం ఉదయం జరిగిన దాడుల్లో సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్‌కు చెందిన ముగ్గురు కమాండోలు మృతి చెందగా.. ఇద్దరు అధికార్లతో సహా ఐదుగురు గాయపడ్డారు. సుకుమా జిల్లాలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో గురువారం ఎన్నికలు జరగనున్న సందర్భంగా సిబ్బందిని చింతగుహ పోలీస్‌స్టేషన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని బుర్కాపాల్‌లో దిగబెట్టి కాలినడకన వస్తున్న కోబ్రా బెటాలియన్‌పై మావోయిస్టులు భారీ ఎత్తున కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో కోబ్రా బెటాలియన్‌కు చెందిన నరసింహ, చంద్రకాంత్ ఘోష్, రణ్‌వీర్‌సింగ్ మృతిచెందగా డిప్యూటీ కమాండెంట్ రమేష్ కుమారిసింగ్, అలోక్, కల్మాడీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించారు. వీరంతా జగ్దల్‌పూర్ 206 కోబ్రా బెటాలియన్‌కు చెందిన వారు. కాగా, ఈ దాడిలో వంద మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నారని అంచనా. వారు మూడు పక్కల నుంచి వచ్చి జవాన్లపై కాల్పుల జరిపారని, దీనికి జవాన్లు కూడా దీటుగానే స్పందించారని అధికారులు చెప్పారు. మరోవైపు, బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ప్రెషర్‌బాంబులు పేల్చడంతో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.

 పోలింగ్‌బూత్ చుట్టూ 15 మందుపాతరలు!

 ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు  బస్తర్ లోక్‌సభ పరిధిలో గల ఓ పోలింగ్‌బూత్ చుట్టూ ఏకంగా 15 మందుపాతరలను పాతిపెట్టారు. ముందే గమనించిన బీఎస్‌ఎఫ్ సిబ్బంది వాటిని వెలికితీసి నిర్వీర్యం చేశారు. నారాయణ్‌పూర్ జిల్లా నేలనార్‌లో గల ఈ 29వ నెంబర్ పోలింగ్‌బూత్‌లో  గురువారం ఓటింగ్ జరగనుంది.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement