ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా, కుంట బ్లాక్, కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాలచలం అటవీ ప్రాంతంలో ఉన్న అమ్మపెంటకు మావోయిస్టు బలగాలు చేరుకున్నట్లు పోలీసు నిఘావర్గాలు పసిగట్టినట్లు తెలిసింది. ధర్మపేట బేస్ క్యాంప్‌పై దాడి చేసేందుకు మావోయిస్టులు వ్యూహం పన్ని అక్కడికి చేరుకున్నారా..? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
దుమ్ముగూడెం మండలానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని ధర్మపేట గ్రామంలో రెండు నెలలుగా బేస్ క్యాంప్ నిర్మాణ పనులు వేగవంతం చేయడంతో పాటు 500-600 మంది పోలీస్ బలగాలు అక్కడ ఉన్నాయి. దీంతో వారిపై గుర్రుగా ఉన్న మావోయిస్టులు అడపాదడపా బేస్ క్యాంప్‌పై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. దీనికి తోడు నిర్మాణ పనులకు వస్తున్న లారీని కూడా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం వద్ద దగ్ధం చేశారు. ఇదిలా ఉండగా పాలచలంపైన ఉన్న ఎర్రబోరు, బెర్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగూడా అటవీ ప్రాంతంలో మావోలు విరుచుకుపడి పోలీసులను హతమార్చిన సంగతి తెలిసిందే.
అనంతరం ఆ మావోయిస్టు బలగాలను 15 రోజుల తర్వాత పాలచలం అటవీప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ధర్మపేట బేస్ క్యాంప్ పై ఏ విధంగా దాడి చేయాలనే దానిపై మావోయిస్టు అగ్రనేత రామన్న అనేక సార్లు సమావేశమైనట్లు తెలిసింది. అనంతరం కిష్టారం, గొల్లపల్లి ప్రాంతాల నుంచి పాలచలం వరకు రోడ్లపై కందకాలు తవ్వి భూబి ట్యాప్స్ అమర్చినట్లు తెలిసింది. దీనికి తోడు చెట్లు నరకి రోడ్డుకు అడ్డంగా పడవేశారని పోలీసులు ఇప్పటికే గుర్తించారు.
ఈ నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించిన ప్రకాష్ దళం, ఉదయ్‌సింగ్ దళంలో మిలీషియా సభ్యులతో అమ్మపెంటకు చేరుకోవడం పోలీసులలో కలవరం లేపుతుంది. బలగాలన్నీ అక్కడికి చేరుకుని ఒక్కసారిగా ధర్మపేట బేస్ క్యాంప్‌పై దాడికి దిగుతారా..లేక ఆ ప్రాంతంలో భారీ సమావేశం నిర్వహిస్తారా ....అనే విషయాలు తెలుసుకోవడానికి మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో దుమ్ముగూడెం సరిహద్దుల్లోని వివిధ పోలీస్‌స్టేషన్‌లకు చెందిన ఎస్సైలతో స్పెషల్ పార్టీ, సీఆర్‌పీఎఫ్ బలగాలను రప్పించి విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దండకారణ్యంలో బేస్ క్యాంప్‌తో పాటు మావోలు మోహరించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని డివిజన్‌లోని పోలీసులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
అమ్మపెంటకు చేరుకున్న మావోయిస్టులు!
Published Wed, Jan 14 2015 9:59 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement