మసూద్‌పై మళ్లీ రెడ్‌కార్నర్
పఠాన్‌కోట్ కేసులో ఎన్‌ఐఏ సాక్ష్యాల ఆధారంగా ఇంటర్‌పోల్ జారీ
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌లో భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి నిషిద్ధ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్‌పై ఇంటర్‌పోల్ మంగళవారం తాజా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈదాడికి మసూద్, రవూఫ్‌లు కుట్రపన్నారన్న ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు పొందిన నేపథ్యంలో ఈ తాజా నోటీసును జారీ చేశారు. నాటి ఉగ్ర దాడిలో దాదాపు 80 గంటల పాటు కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది చనిపోగా.. నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.
మసూద్, రవూఫ్‌లపై ఇంతకుముందు జారీ చేసిన అరెస్ట్ వారెంట్ల విషయంలో పాక్ స్పందించలేదు. దీంతో తాజా రెడ్ కార్నర్ నోటీసులను లాంఛనంగానే పరిగణిస్తున్నారు. పాకిస్తాన్‌లో ఉన్న అజహర్‌పై.. భారత పార్లమెంటుపై, జమ్మూకశ్మీర్ శాసనసభపై దాడికుట్ర ఆరోపణల్లో గతంలో రెడ్‌కార్నర్ నోటీసులు ఉన్నాయి. రవూఫ్‌పై 1999లో విమానం హైజాక్‌కు సంబంధించి అదే తరహా వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఉగ్రవాదులకు, జైషే నేతలైన జాన్, లతీఫ్‌లకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులు, ఆ దాడి తమ పనేనంటూ రవూఫ్ పేర్కొన్న వీడియో దృశ్యాలను ఎన్‌ఐఏ సమర్పించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు నేతృత్వం వహించిన కాషిఫ్, షాహిద్ లతీఫ్ పైనా రెడ్ కార్నర్ నోటీసులను ఎన్‌ఐఏ కోరింది.
2010లోనే లతీఫ్‌విడుదల
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు భారత్‌లో ఎలా చొరబడ్డారన్న దానిపై దర్యాప్తు అధికారులు సమాచారాన్ని వెలికితీశారు. ఆదాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు మద్దతు అందించిన జైషే నేత షాహిద్ లతీఫ్(47)ను 2010లో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం విడుదల చేసింది. పాక్‌కుచెందిన లతీఫ్.. 1996లో జమ్మూలో అరెస్టయ్యాడు. పాక్‌తో సంబంధాలను మెరుగుపరచుకునే చర్యల్లో భాగంగా లతీఫ్‌ను, మరో 20 మంది పాక్ ఉగ్రవాదులను ఆరేళ్ల కిందట నాటి యూపీఏ ప్రభుత్వం విడుదల చేసింది.