శ్రీనగర్/న్యూఢిల్లీ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌కు సోదరుడి కొడుకు తల్లా రషీద్ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. 1999లో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లడం తెలిసిందే. ఈ హైజాక్ కుట్రకు సూత్రధారిగా వ్యవహరించిన అబ్దుల్ రౌఫ్ కొడుకే తల్లా రషీద్. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో తల్లా రషీద్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.
అమెరికా తయారు చేసిన, పాకిస్తానీ ప్రత్యేక దళాలు ఉపయోగించే ఎం4 రైఫిల్, రెండు ఏకే–47 తుపాకులను ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఆర్మీకి చెందిన ఓ సైనికుడు కూడా మరణించాడు. హతమైన ముగ్గురు ఉగ్రవాదులను మహ్మూద్ భాయ్ (దక్షిణ కశ్మీర్‌లో జైషే కమాండర్), వసీం అహ్మద్, తల్లా రషీద్‌గా గుర్తించామని అధికారులు చెప్పారు. వీరిలో మహ్మూద్ భాయ్, తల్లా రషీద్‌లు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు.
మసూద్ అజర్ సోదరుడి కొడుకు తల్లా రషీద్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడంటూ జైషే అధికార ప్రతినిధి స్థానిక వార్తా సంస్థలకు ప్రకటనలు పంపాడు. రషీద్‌ను తమ వాడిగా చెప్పుకున్నందుకు జైషేకు ధన్యవాదాలు తెలియజేసిన ఐజీ మునీర్ ఖాన్...ఉగ్రవాదుల మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా పాకిస్తాన్‌కు సందేశం పంపుతామని చెప్పారు. ఎం4 రైఫిళ్లను పాకిస్తాన్ ప్రత్యేక బలగాలు ఉపయోగిస్తాయనీ, వారే వీటిని జైషే ఉగ్రవాదులకు ఇచ్చి ఉంటారని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి చెప్పారు.
రూ.36.5 కోట్ల పాత నోట్ల జప్తు
ఉగ్రవాదులకు నిధుల చేరవేత కేసుకు సంబంధించి జరుపుతున్న విచారణలో భాగంగా రూ.36.5 కోట్ల విలువైన పాత రూ.500, రూ.వెయ్యి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం వెల్లడించింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు దగ్గర్లోని ఓ ప్రదేశంలో సోమవారం ఈ నోట్లు దొరికినట్లు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment