‘30మంది ఉగ్రవాదులు కనిపించారు’
శ్రీనగర్: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నాలుగువేలమంది. అంతా ఆర్మీ, పోలీసులు, పారామిలిటరీ విభాగాలకు చెందిన భారీ బలగం.. ఏకకాలంలో 20 గ్రామాల్లో కార్డన్ సెర్చ్.. ఇది దక్షిణ జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలికిడి ఎక్కువగా ఉన్న గ్రామాల్లో నిర్వహించిన భారీ కార్డన్ సెర్చ్‌కు సంబంధించిన సంగతి. 1990 తర్వాత ఇప్పటి వరకు నిర్వహించిన అతిపెద్ద కార్డన్ సెర్చ్ ఇదే. షోపియాన్ జిల్లాలోని హీఫ్, చిలిపోరా, మల్నాడ్, తుర్కావంగంవంటి తదితర 20 గ్రామాల్లో సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఊహించిన పరిస్థితులే ఎదురయ్యాయి. పలు గ్రామాల్లో ఉగ్రవాదులు తిరుగుబాట్లకు దిగారు.
కాల్పులతో ఎదురుదాడి చేశారు. ఇక వారి ప్రభావానికి లోన ఉన్న ఆ గ్రామల్లోని యువత ఆపరేషన్ జరగకుండా అడ్డుకునేందుకు ఎప్పటి మాదిరిగానే బలగాలపై రాళ్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఇలాంటి చర్యలతో తుర్కావంగం, సుగాన్ గ్రామాల్లో పలువురు గాయపడ్డారు. బలగాలు జరిపిన కాల్పుల్లో పెల్లెట్లు తగిలి పలువురు గాయపడ్డారు. సెర్చింగ్ ఆపరేషన్‌కు సహకరించిన ఓ ట్యాక్సీ డ్రైవర్ అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. మరోపక్క, రాష్ట్రీయ రైఫిల్స్‌పై ఇమామ్‌సాహిబ్ అనే గ్రామంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు గాయపడ్డారు.
అయితే, మొత్తం ఈ సెర్చింగ్ ఆపరేషన్‌కు సంబంధించి మాట్లాడుతూ.. 30మంది ఉగ్రవాదులు అటు ఇటూ తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం వల్లే తాము కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, తాము ఊహించినట్లే ఈ గ్రామాల్లో పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నట్లు తాజా పరిణామాల ప్రకారం తెలుస్తోందని అన్నారు. తాము లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల కోసం కుల్గామ్ జిల్లాలోని కుద్వానీ గ్రామంలో కూడా ఆపరేషన్ ప్రారంభించామని అయితే, వారు అప్పటికే అక్కడి స్థానికుల మద్దతుతో పారిపోయారని అన్నారు. షోపియాన్‌లో నిర్వహించిన తాజా సెర్చింగ్ ఆపరేషనే గత దశాబ్దకాలంలో పెద్దదని తెలిపారు.