లక్నో : ఈవీఎంలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తాము తప్పక హాజరయ్యేవారమని బీఎస్పీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. పేదరికం వంటి మౌలిక సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జమిలి ఎన్నికల ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెస్తోందని ఆరోపించారు. జమిలి ఎన్నికలతో పాటు మహాత్మ గాంధీ 150వ జయంతోత్సవ వేడుకలు వంటి పలు అంశాలపై చర్చించేందుకు బుధవారం ప్రధాని అధ్యక్షతన పలు రాజకీయ పార్టీల అధినేతలతో సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈవీఎంలపై ప్రజల్లో ఉన్న విశ్వాసం ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలతో పూర్తిగా కనుమరుగైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాలెట్ పత్రాలతో కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అసలైన ముప్పుగా మాయావతి అభివర్ణించారు. ఈవీఎంల వంటి కీలక అంశంపై నేటి సమావేశం ఏర్పాటు చేస్తే తాను తప్పక హాజరయ్యేదాన్నని ఆమె స్పష్టం చేశారు. కాగా ఈ భేటీకి కాంగ్రెస్, ఆప్, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు గైర్హాజరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment