
గూండాల ప్రభుత్వాన్ని కూలదోస్తా
ఉత్తరప్రదేశ్‌లో తాము అధికారంలోకి వచ్చి తీరుతామని, సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలో ఉన్న గూండాలు, మాఫియాల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తానని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన భారీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపైనా ఆమె నిప్పులు కక్కారు. ఈ మూడూ అవకాశవాద పార్టీలని, ఎన్నికల లబ్ధి కోసం దళితులను ఊరిస్తున్నాయని అన్నారు. కేవలం యూపీలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఉన్న దళితులు ఈ పార్టీల కబుర్లను జాగ్రత్తగా వినాలని, ఎన్నికల లబ్ధి తప్ప వారికి నిజంగా ఈ అంశాలపై నిబద్ధత లేదని అన్నారు.
యూపీలో ఉన్న దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో కూలదోయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన రాజకీయ గురువు, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ స్వయంగా చెప్పడం వల్లే తాను యూపీలో అధికారంలో ఉన్నప్పుడు తన సొంత విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నట్లు మాయావతి వివరించారు. ఇతర పార్టీలు తనపై కుట్ర పన్నాయని, పార్కులలో ఏనుగుల బొమ్మలు పెట్టినందుకు కూడా విమర్శించాయని ఆమె చెప్పారు. తమ పార్టీ గుర్తును ప్రచారం చేసుకోడానికే ప్రయత్నించినట్లు వాళ్లు అన్నారు గానీ, తాను మాత్రం వాటిని స్వాగత చిహ్నాలుగా మాత్రమే ప్రతిష్ఠించానన్నారు.