uttarpradesh elections
-
కసబ్ అన్నా.. ఖబరిస్థాన్ అన్నా గెలిపించారు!
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీ ఒక్కదానికే 312 స్థానాలు వచ్చాయి. అంటే, నాలుగింట మూడొంతుల మెజారిటీ అన్నమాట. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు ఉండటం చాలా అవసరం. ఉత్తరాఖండ్‌లో కూడా ఇంతకంటే ఎక్కువ స్థాయిలోనే బీజేపీ విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ - సమాజ్‌వాదీ పార్టీలు పొత్తు పెట్టుకుని ఒకటిగా పోటీచేసినా కూడా వాళ్లు 54 స్థానాలు మాత్రమే సాధించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం సమయంలో 'కసబ్' అని, 'ఖబరిస్థాన్' అని.. ఇలా పలు రకాల మాటలు వినిపించాయి. ప్రచార పర్వంలో దూషణభూషణలు చాలా తీవ్రస్థాయిలో ఉండటంతో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగాలలో ఇలాంటి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు తీవ్రంగా విమర్శించారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోడానికి మోదీ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ అంటూ చిట్టా చదివారు. కానీ అవేమీ పని చేయలేదు. అంతేకాదు.. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడ్డారని, బీజేపీని గెలిపిస్తే ఇక్కడ మరింత అరాచకం తప్పదని చేసిన ప్రచారాలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ వనవాసం తర్వాత బీజేపీ మళ్లీ ఉత్తరప్రదేశ్‌లో అధికారం సాధించింది. కసబ్‌కు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ ఓ సభలో చెప్పారు. క అంటే కాంగ్రెస్, స అంటే సమాజ్‌వాదీ, బ అంటే బహుజన సమాజ్ పార్టీ అని దానికి అర్థం చెప్పారు. ఇక హిందూ ముస్లింల గురించి మాట్లాడుతూ, 'ఖబరిస్థాన్‌లో కరెంటు ఉంటే శ్మశానంలో కూడా ఉండాలి. రంజాన్‌కు కోతలు లేకుండా కరెంటు ఇస్తే.. దీపావళికి కూడా అలాగే ఇవ్వాలి. మతాల మధ్య భేదభావాలు ఉండకూడదు' అని మరో సందర్భంలో వ్యాఖ్యానించారు. మోదీ చేసిన ఈ తరహా వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. నిజానికి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా కూడా బీజేపీకి ప్రజలు పట్టం గట్టారు. ముస్లిం ఓట్లలో చీలిక రావడం, సమాజ్‌వాదీ పార్టీ కుటుంబంలో విభేదాలు, పార్టీకి పెద్దదిక్కు అయిన ములాయం సింగ్ యాదవ్ లాంటివాళ్లు అసలు ప్రచారం చేయకపోవడం లాంటివి సమాజ్‌వాదీ పార్టీని దెబ్బతీయడంతో పాటు బీజేపీకి కూడా ఓట్లను గణనీయంగా పెంచాయి. -
అబ్బాయికి బాబాయ్ సపోర్ట్!
నిన్న మొన్నటి వరకు ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. ఇప్పుడు ఒకరంటే ఒకరు అభిమానం కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఇది. యూపీలో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదే గానీ.. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ది కాదని పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్ అన్నారు. యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి కేవలం 47 స్థానాలు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు శివపాల్ - అఖిలేష్ ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉన్న విషయం తెలిసిందే. ఇంతటి మోదీ గాలి, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా శివపాల్ మాత్రం జస్వంత్‌నగర్ స్థానంలో బీజేపీ నాయకుడు మనీష్ యాదవ్ పాత్రేను 52 వేల ఓట్ల తేడాతో ఓడించారు. పార్టీ ఓటమికి ఏ ఒక్కరినీ నిందించబోమని, నేతాజీ పోరాటానికి ఇప్పుడు కూడా తామంతా మద్దతుగా ఉంటామని ఆయన అన్నారు. పార్టీ ఇంతకుముందు ఎక్కడ ఉండేదో మళ్లీ అక్కడకు తీసుకెళ్తామన్నారు. ములాయం సింగ్ యాదవ్ మరో తమ్ముడు అభయ్ రామ్ యాదవ్ మాత్రం ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. జరిగిందేదో జరిగిపోయిందని నిట్టూర్చారు. -
బీజేపీ విజయం.. పాక్‌లో వణుకు!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయం పాకిస్తాన్ వెన్నులో వణుకుపుడుతోందటా. ఉడీ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో అనుసరించే పాలసీ విషయాల్లో మార్పులను ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత చేయాలని భాజాపా ప్రభుత్వం ఎదురుచూస్తోందని గతంలో పలు వార్తలు ప్రచురితమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అఖండ మెజారీటీ సాధించిన బీజేపీ దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారింది. దీంతో పాకిస్తాన్‌తో అనుసరించాల్సిన పాలసీల్లో పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయనే గుసగుసలు కేంద్ర ప్రభుత్వంలో వినిపిస్తున్నట్లు ఓ జాతీయ పత్రిక పేర్కొంది. ఉడీ దాడి తర్వాత పాక్ ఆగడాలను ఇక సహించబోమంటూ సిగ్నల్స్ ఇచ్చింది భారత్. సర్జికల్ స్ట్రైక్స్, సింధు నదీ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష వంటి నిర్ణయాలను తీసుకుంది. దీంతో షాక్‌కు గురైన పాకిస్తాన్.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత ఎప్పుడు ఏమవుతుందోననే ఆందోళనలో ఉంది. ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు మోదీ పాక్‌పై తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు సమర్ధించారు. దీంతో మోదీ అలాంటి చర్యలనే భవిష్యత్తులో కొనసాగించే అవకాశం ఉంది. మోదీ గెలుపు తర్వాత తొలిసారి దేశంలో పర్యటించనున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌తో భద్రతా సంబంధాలను మరింత బలపర్చుకునే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌తో అత్యధిక భాగం బోర్డర్‌ను కలిగివున్న బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు ఎదురవుతున్న సమస్యలను తగ్గించేలా చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా రాజకీయంగా అస్ధిరత నెలకొన్న నేపాల్‌తో కూడా సంబంధాలు బలపర్చుకోవడం మరింత సులువు అవుతుంది. -
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ అసాధారణ విజయం సాధించినందుకు కేసీఆర్ ఈ సందర్భంగా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతి కోసం పునరుత్తేజిత శక్తితో పనిచేసేందుకు ఈ విజయం మీ(ప్రధాని)కు స్ఫూర్తి నిస్తుందని అన్నారు. దేశాభివృద్ధికి మరింత ఉత్సాహం, నిబద్ధతతో మీరు పని చేస్తున్నారని ఆశిస్తున్నాఅంటూ... ఈ మేరకు కేసీఆర్ ప్రధానికు లేఖ రాశారు. -
సమీకరణల బాద్‘షా’
ఎస్పీ, బీఎస్పీలకు రివర్స్‌లో వ్యూహాలు విజయమే లక్ష్యంగా 2014 నుంచే వ్యూహాలు అన్ని తానై నడిపించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు సాక్షి, న్యూఢిల్లీ: 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో తన వ్యూహాలతో బీజేపీకి 71 లోక్‌సభ స్థానాలను సాధించిపెట్టిన అమిత్ షా.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేశారు. మినీ భారతదేశంగా పరిగణించే యూపీలో విజయమే లక్ష్యంగా అమిత్ షా రచించిన ప్రణాళిక రాష్ట్ర చరిత్రలో కనీవినీఎరుగని రీతిలో బీజేపికి విజయాన్ని తెచ్చిపెట్టాయి. 2014 సాధారణ ఎన్నికలు ముగియగానే యూపీపై పూర్తి దృష్టి సారించిన షా అందుకు తగ్గట్టుగానే తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టపరుస్తూ చిట్టచివరి వ్యక్తి వరకు బీజేపీ లక్ష్యాలను తీసుకెళ్లగలిగారు. యూపీలో బీజేపీ ప్రభంజనం సృష్టించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ఒక కారణం అయితే ములాయం సింగ్ కుటుంబంలో ములసం, దళితుల ఓట్లు కూడా సాధించుకోలేకుండా మరీ బలహీనంగా మారిన బీఎస్పీ మరో కారణం. ఈవీఎంలను ట్యాంపర్ చేశారని మాయవతి ఆరోపణలు చేసినా, కుటుంబ కలహాలు, ప్రణాళికల అమలులో లోపాల వల్ల ఓడినట్టు అఖిలేష్ ఓటమిని అంగీకరించినా.. ఈ ఇద్దరూ దగ్గరుండి మరి బీజేపీ విజయనికి మార్గం సుగమం చేశారు. బీజేపీకి చారిత్రక విజయాన్ని అందించారు. ఎస్పీ, బీఎస్పీల ఓటు బ్యాంకుకు పక్కా స్కెచ్.. ఇక అమిత్ షా ప్రణాళికల విషయానికొస్తే ప్రధాని మోదీ తన వెనకున్నాడన్న బలమైన కారణంతో తను వేసిందే వ్యూహం అన్నట్టు ప్రణాళికలను రచించారు. అగ్రవర్ణాలైన రాజ్‌పుత్‌లు, బ్రహ్మణ, బనియా వర్గాలకు చెందిన వారి పార్టీగా ముద్రవేసుకున్న బీజేపీ.. ఎస్పీ, బీఎస్పీలకు ప్రధాన ఓటు బ్యాంకు అయిన యాదవ యేతర ఓబీసీలు, కోయిరీ, కుర్మీ, రాజ్బర్, దళితులు, ముస్లింల ఓట్లను బీజేపీకి రాబట్టడంలో సఫలీకృతం అయ్యారు. బీఎస్పీలో అసంతృప్తు దళితనేతలైన బాబుసింగ్ కుషవాహా, బద్షా సింగ్, దడ్డన్ మిశ్రా, అవదేశ్ కుమార్ వర్మా లాంటి సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకొని రాష్ట్రంలో 21 శాతం ఉన్న దళితుల ఓటు బ్యాంకులో చాలా వరకు బీజేపీ వైపు మొగ్గుచూపేలా చేశారు. రాష్ట్రంలో 18 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లలో బీజేపీకి రెండు శాతం ఓట్లే లభించాయని సర్వేలు చెబుతున్నప్పటికీ ఈ వర్గాల ఓట్లే బీజేపీకి మెజారిటీ దక్కేలా చేశాయన్నది వాస్తవంగా కనిపిస్తోంది. ఎస్పీ, బీఎస్పీల వ్యూహాలకు పూర్తిగా రివర్స్‌లో ప్రణాళికలు రచించిన షా ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకులను బీజేపీకి దక్కేలా చూసుకున్నారు. ఎస్పీ–కాంగ్రెస్, బీఎస్పీలకు ధీటుగా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన అమిత్ షా పోటాపోటీ రోడ్ షోలతో తన వ్యూహాలకు పదునుపెట్టారు. తన ప్రచారంలో ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీలైతే నువ్వు లేదా నేను అన్న రీతిలో ఎస్పీ, బీఎస్పీలు యూపీని దోచుకున్నాయని విమర్శలు గుప్పించారు. కేంద్ర క్యాబినేట్లోని డజను కంటే ఎక్కువ మంది మంత్రులను ప్రతిక్షణం ప్రచారంలో దింపి వారి వర్గాల ఓట్లు ఇతరుల వైపు మళ్లకుండా జాగ్రత్తపడ్డారు. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ముందుగానే ప్రకటించకుండా ఎన్నికల ముందు పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తి కలగకుండా షా చూసుకున్నారు. సీనియర్లు అందరూ ఎన్నికలపైనే దృష్టి పెట్టేలా వారందరినీ నడిపించారు. ప్రధాని తన పనులు మానుకొని మరీ యూపీలో వీలైనన్ని ఎక్కువ ప్రాంతల్లో ప్రచారం చేసేలా చూసుకున్నారు. తూర్పు యూపీలో ఎన్నికల చివరి విడతలో ఏకంగా మూడు రోజుల పాటు మోదీ మకాం వేసి గతంలో ఏ ప్రధాని చేయనట్టు రోడ్ షోలు నిర్వహింపజేశారు. అలాగే పార్టీ అనుబంధ సంఘాలు వాటి స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగేలా దిశానిర్దేశం చేశారు. మొత్తానికి యూపీలో బీజేపీ విజయం సాధించడానికి మోదీ చరిష్మా ఒక కారణం అయితే, కనిపించే అమిత్ షా ప్రణాళికలు మరో కారణం అని చెప్పవచ్చు. -
ఎగ్జిట్ పోల్స్ నమ్మం.. అధికారం మాదే!
-
ఎగ్జిట్ పోల్స్: అఖిలేశ్ సంచలన ప్రకటన
-
ఎగ్జిట్ పోల్స్ నమ్మం.. అధికారం మాదే!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మూడో స్థానానికి పరిమితమవుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీఎస్పీ నిర్ద్వంద్వంగా ఖండించింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఎంతమాత్రం నమ్మబోమని బీఎస్పీ పేర్కొంది. తాజా యూపీ ఎన్నికల్లో అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ బోగసేనని, ఈ విషయంలో కౌంటింగ్ రోజు తేలుతుందని బీఎస్పీ పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైతే బీఎస్పీతో చేతులు కలుపుతామన్న యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. యూపీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధిస్తామంటూ ప్రచారం సందర్భంగా అఖిలేశ్ చెప్పివన్నీ డాంబికాలేనని ఈ వ్యాఖ్యతో తేలిపోయిందని, ఈ ప్రకటనలో ఆయన బలహీనత కనిపిస్తున్నదని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు. -
ఎగ్జిట్ పోల్స్: అఖిలేశ్ సంచలన ప్రకటన
లక్నో: కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలు వెల్లడించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం అవసరమైతే.. బీఎస్పీతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని అధికారంలోకి రాకుండా చూడటమే తమ ధ్యేయమని, అందుకోసం తన బద్ధవిరోధి అయిన మాయావతితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన పేర్కొన్నారు. యూపీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. అయితే, ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దక్కే అవకాశం లేదని తేల్చాయి. యూపీలో హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. హంగ్ అసెంబ్లీ కనుక ఏర్పాటైతే.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశముంది. ఈ నేపథ్యంలో మాయావతి ఎవరివైపు మొగ్గుచూపితే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హంగ్ అసెంబ్లీ కనుక ఏర్పాటైతే.. మాయావతి ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తికరమైన అంశమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
నాడు ముస్లింలూ మోదీకే ఓటేశారు!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కుల, మతాల ప్రాతిపదిక ఎన్నికలు జరుగుతాయని, ముఖ్యంగా ముస్లింలంతా గంప గుత్తాగా ఒక్క పార్టీకే ఓటేస్తారని, అందులోను ముఖ్యంగా బీజేపీని ఓడించే సామర్థ్యం ఉన్న పార్టీకి ఓటేస్తారని, అది వారి మనస్తత్వమని సాధారణ ప్రజల నుంచి సామాజిక శాస్త్రవేత్తల వరకు విశ్లేషిస్తూ వస్తున్నారు. అదంతా ఒట్టి భ్రమేనని ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా బక్షా అనే ముస్లింలు ఎక్కువగా ఉండే గ్రామంలో పలువురు ప్రజల నుంచి మీడియా అభిప్రాయాలు సేకరించగా వెల్లడయింది. పది శాతం ముస్లిం జనాభావున్న బక్షా గ్రామాన్ని కూడా సామాజిక శాస్త్రవేత్తలు తమ విశ్లేషణల్లో ప్రస్తావించారు గనుక మీడియా ఈ గ్రామాన్ని అభిప్రాయ సేకరణకు ఎంచుకోవాల్సి వచ్చింది. నాడు బీఎస్సీ, ఆతర్వాత ఎస్పీకి, తర్వాత మోదీకి ఓటు ఈ గ్రామంలోని ముస్లింలు ఎక్కువగా 2007 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఓటేయగా, 2012లో సమాజ్‌వాది పార్టీకి, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. ఒక్కపార్టీకి ఓటేయడం అనేది వీరిలో ఉందిగానీ, ఫలానా పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలనే భావన లేదు. వీరు తమ ముస్లిం అభ్యర్థులకు వ్యతిరేకంగా కూడా ఈ ఎన్నికల్లో ఓటేశారు. ఎన్నికల గాలి ఎటువైపు వీస్తుందో, ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందో తెలుసుకొని వారు ఓటేస్తారు. అంటే తమ ఓటు దుర్వినియోగం కారాదన్నదే వారి ఆలోచన. ఓటేసే ముందు ‘ఎవరికి ఓటేయాలనుకుంటున్నావు లేదా ఎవరికి ఓటేశావు?’ అని ఇరుగు పొరుగు ప్రజలను ఒకటికి రెండుసార్లు సంప్రతించి ఓటేస్తారు. సమాజ్‌వాది పార్టీకే వేశాను మొహమ్మద్ ముక్తార్ అలీ అనే 42 ఏళ్ల దివ్యాంగుడు గత కొన్నేళ్లుగా గ్రామంలో దర్జీ పనిచేసుకొని బతుకుతున్నారు. ఓ కాలు పొట్టిగా మరో కాలు పొడుగ్గా ఉండడం వల్ల ఆయనకు గత 18 ఏళ్లుగా పింఛను వస్తోంది. 2007లో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీకి ఓటేశారు. మాయావతి ప్రభుత్వం హయాంలో ఓ నెల హఠాత్తుగా దివ్యాంగుల పింఛను ఆగిపోయింది. ప్రభుత్వాధికారి వద్దకు వెళితే ఆయనే దగ్గరికి వచ్చి సమస్య ఏమిటని వాకబు చేశారు. బ్యాంకు ఖాతా నెంబరు తీసుకొని ఒక్కరోజులేనే పింఛను వస్తుందని భరోసా ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగానే ఒక్కరోజులోనే పింఛను సొమ్ము వచ్చి ఆయన బ్యాంకులో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు పింఛను ఆగలేదు. 2012 ఎన్నికల్లో మాత్రం ఆయన సమాజ్‌వాది పార్టీకి ఓటేశారు. ఓటు వధా కారాదు అలా ఎందుకు ఓటేశారని ప్రశ్నిస్తే, తమ ప్రాంతం వారంతా ఎస్పీకి ఓటేస్తున్నారని తెలిసి ఓటు వధా కాకుడదన్న ఉద్దేశంతో ఎస్పీకి ఓటేశానని, 2007లో కూడా తోటి వారి అభిప్రాయం మేరకు మాయావతి పార్టీకి ఓటేశానని చెప్పారు. 2014 ఎన్నికల గురించి ప్రశ్నించగా అప్పుడు దేశమంతా మోదీ పేరు మోగి పోతుంది కనుక ఆయనకే ఓటేశానని చెప్పారు. కేవలం ముస్లింలు ఓటు ఎటు వేస్తున్నారన్న అంశాన్నే పరిగణలోకి తీసుకొని ఓటేస్తారా? అని ఆయన్ని మీడియా ప్రశ్నించగా, ‘నేను నా ప్రాంతం వారన్నానుగానీ, ముస్లింలని చెప్పడం లేదు. నా ప్రాంతంలోని హిందువులు, క్రైస్తవులు, ఇతర ప్రాంతాల అందరి అభిప్రాయలను తీసుకొనే ఓటేస్తాను. మంచి వాళ్లు గెలవాలి, మా ప్రాంతం బాగు పడాలన్నదే మా తాపత్రయం’ అని ఆయన చెప్పారు. తన వద్దకు ఎంతోమంది హిందూ యువతులు, స్త్రీలు వచ్చి బట్టలు కుట్టించుకుంటారని, వారంతా తనను చాచా, చాచా అని ఎంతో అప్యాయంగా పిలుస్తారని, అలాంటప్పుడు తనకు ముస్లింననే భావన ఎక్కడుంటుందని ప్రశ్నించారు. ఆయనింటి ఇరుగు పొరుగున నాయీ బ్రాహ్మణలు, యాదవులు, మౌర్యులు, బ్రాహ్మణుల ఇళ్లు కూడా ఉన్నాయి. ముస్లిం మహిళ మెడలో మంగళసూత్రం బక్షా ఊరులో సయ్యద్ బాబా దర్గా ఉంది. ముస్లింలకన్నా హిందువులే ఎక్కువగా ఆ దర్గాను సందర్శిస్తారు. పక్క వీధిలోనే మీడియాకు చీరల్లో ఇద్దరు స్త్రీలు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కనిపించారు. వారిలో ఒకరి మెడలో మంగళసూత్రం ఉంది. మరొకరి నుదుటన సింధూరం ఉంది. వారెవరని వాకబు చేస్తే ఆశ్చర్యంగా వారు ముస్లిం మహిళలని తెల్సింది. వారిలో ఒకరి పేరు పర్వీనా బానో, మరొకరు జులేఖా బేగమ్ అని తెల్సింది. తాము వత్తిని నమ్ముకుని బతుకుతున్నాంగానీ, మతాన్ని కాదని వారు చెప్పారు. ఆ ఊరిలో ముస్లిం స్త్రీలు చీరలు కట్టుకోవడం, సింధూరం పెట్టుకోవడం, పిల్లలు చుడేదార్ పైజామా ధరించడం, ముఖాన అంగవస్త్రం ధరించడం ఫ్యాషన్‌గా మరిపోయిందని చెప్పారు. వారిద్దరు కూడా టెయిలర్ వృత్తి చేస్తారట. రాజకీయాల గురించి అడిగితే తమకు తెలియవని చెప్పారు. చాయ్ బేజ్నే వాలేకో చడాయి.... అదే వీధిలో మరో వయోధికురాలిని ప్రశ్నించగా ‘చాయ్ బేజనే వాలేకో చడాయిదియా, ఔర్ వో ఊపర్ సే కుడాయి దియా (చాయ్ అమ్ముకునే ఆయన్ని అందలం ఎక్కిస్తే ఆయన మరుగుతున్న చాయ్‌ను మా అందరి నెత్తిల మీద పోశారు)’ అంటూ దేశంలో పెద్ద నోట్ల రద్దును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మేము ముస్లింలం అయినప్పటికీ గత పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి ఓటేస్తే ఆయనేం చేశారో చూడండి’ అంటూ పక్కనే ఉన్న ఆమె భర్త మొహమ్మద్ రయీస్ వ్యాఖ్యానించారు. భార్యాభర్తలు దారిద్య్ర రేఖకు దిగువనే జీవిస్తున్నప్పటికీ వీరికి కేంద్ర పింఛనుగానీ, సమాజ్‌వాది రాష్ట్ర ప్రభుత్వం పింఛనుగానీ అందడం లేదట. తాను గాజులు విక్రయిస్తూ జీవిస్తున్నామని, పెద్ద నోట్లకు రద్దుకు ముందు రోజుకు వందరూపాయలకు పైగా ఆదాయం రాగా ఇప్పుడు 70 రూపాయలకు మించడం లేదని ఆయన తెలిపారు. మంచి పనిచేసే వారికే ఓటు సైకిళ్లపై తిరుగుతూ చీరలమ్మే వారిని పలకరించగా పెద్ద నోట్ల రద్దుతో తమ వ్యాపారం కూడా ఘోరంగా పడిపోయిందని, గ్రామంలో ఎవరు కూడా సుఖంగా జీవించడం లేదని చెప్పారు. వారి వార్షికాదాయం గురించి ప్రశ్నించగా 30 వేల రూపాయలకు మించి ఉండదని వారిలో ఒకరైన లాల్ మొహమ్మద్ తెలిపారు. ఏడాదికి 36వేల రూపాయల లోపు ఆదాయం వచ్చే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయల భృతిని ఇస్తోంది. వీరిద్దరికైతే అది రావడం లేదట. అయినా మొదటి నుంచి సమాజ్‌వాది పార్టీకే ఓటు వేస్తున్నారట. మంచి పని ఎవరు చేస్తే వారికేస్తాం అది వారు చెప్పారు. అఖిలేష్ యాదవ్ చేసిన మంచి పనులేమిటో చెప్పమని వారిని ప్రశ్నించగా వారు చెప్పలేకపోయారు. ఎవరికో ఒకరికి మంచి పనులు చేస్తున్నారుగదా అని అనుకుంటున్నాంగానీ తమకేమీ తెలియదని చెప్పారు. మెకానిక్ షాపులు, చిన్న దుకాణాలు, రెడీమేడ్ షాపులు నడుపుతున్న ముస్లింలను, గృహిణులను ఈసారి ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్నించగా, ఎవరు మంచి పనులు చేస్తే వారికని, ఎవరు గెలిచే అవకాశం ఉంటే వారికి ఓటేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒక నిర్ణయానికి మాత్రం రాలేదని ఎక్కువ మంది చెప్పారు. -
16 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు
మథుర: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికలోనైనా పోటీ చేసి ఓడిపోవడం ఆయనకు అలవాటు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లోకూడా ఆయన పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నమోదైన తొలి నామినేషన్ కూడా ఆయనదే. ఆయన పేరు ఫక్కడ్ బాబా. మథుర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి, మార్చిల్లో ఐదు దశల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాల్లో కొత్త వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ఫక్కడ్ బాబా 1977 నుంచి 16 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన బాబా అన్నింట్లోనూ ఓటమిని చవి చూశారు. వాటిలో 8 జాతీయ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా తాను గెలవనని ముందే చెప్పారు. నామినేషన్ వేయడానికి రూ.10వేలు విరాళాలు సేకరించుకున్నట్లు వెల్లడించారు. బాబాకు ఎలాంటి ఆస్తులు లేవు. గుళ్లలో, ప్రభుత్వం ఏర్పాటుచేసిన నైట్ షెల్టర్లలో బస చేస్తుంటారు. తన గురువైన జగన్నాథ్ పూరీకి చెందిన శంకరాచార్యులు కలలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయమని ఆదేశించారని, అందుకే పోటీ చేస్తున్నానని చెప్పారు. రాజకీయ నాయకులంతా అబద్ధాల కోరులే అని, తాను గెలిస్తే వ్యవస్థను శుద్ధి చేస్తానని అన్నారు. ఇన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన బాబాకు అన్నిటికన్నా ఎక్కువగా 1991 ఎన్నికల్లో ఎనిమిది వేల ఓట్లు వచ్చాయట. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయనకు రూ.84 వేల విరాళాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో హేమమాలినిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
బుందేల్‌ఖండ్ నుంచే అఖిలేష్ పోటీ ఎందుకు?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బుందేల్‌ఖండ్ ప్రాంతం నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రెండు రోజుల క్రితం సూచనప్రాయంగా తెలియజేశారు. ఎందుకు ఆయన అక్కడినుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? పోటీ చేస్తే ఆయనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? తండ్రి ములాయం సింగ్ యాదవ్‌తో తగువును కొనసాగిస్తూనే అఖిలేష్ యాదవ్ బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పలు ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలోనే బాగా వెనకబడి ఉన్న ఆ ప్రాంతంలో పలు సౌర విద్యుత్ ప్రాజెక్టులను కూడా చేపట్టారు. మరిన్ని అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. పలు ఉచిత పథకాలను ప్రకటించారు. ఆ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ జాతీయ ఉపాధి హామీ, ఆహార భద్రతా పథకం, మధ్యాహ్న భోజన పథకాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు సామాజిక భద్రతా పింఛన్లను మంజూరుచేస్తానని చెప్పారు. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఎప్పుడూ వార్తల్లో నిలిచే బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో తమ పట్టు నిలబెట్టుకోవాలన్నది అఖిలేష్ ఎత్తుగడ. రాష్ట్ర అసెంబ్లీలో 403 సీట్లు ఉండగా బుందేల్‌ఖండ్‌లో కేవలం 19 స్థానాలు మాత్రమే ఉన్నాయి. సాంస్కృతికంగా, చారిత్రకంగా ఈ ప్రాంతానికి ఎంతో గుర్తింపు ఉంది. ఇటు ఉత్తరప్రదేశ్‌తో పాటు అటు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్‌పై పట్టు సాధిస్తే మున్ముందు జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు కూడా అది ఉపయోగపడుతుంది. అందుకనే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలు కూడా బుందేల్‌ఖండ్ అభివృద్ధికి పలు హామీలు ఇస్తున్నాయి. ప్రభుత్వ పథకాల్లో అవినీతి, వరుస కరువుల వల్ల ఈ ప్రాంతం బాగా వెనకపడి పోయింది. నిజాయితీపరుడని పేరున్నందువల్ల అఖిలేష్ వాగ్దానాలను బుందేల్‌ఖండ్ ప్రజలు విశ్వసించే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎటావా, కనౌజ్, మైపూరి, ఫరూకాబాద్‌లో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పట్టుంది. దానికి బుందేల్‌ఖండ్ సీట్లు తోడైతే పార్టీకి ఎన్నికల్లో విజయావకాశాలు పెరుగుతాయన్నది అఖిలేష్ వ్యూహం. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బుందేల్‌ఖండ్‌లో బీఎస్పీకి 7, ఎస్పీకి 5, కాంగ్రెస్‌కు 4, బీజేపీకి 3 సీట్లు వచ్చాయి. వాటిలో బాబినా లేదా మహోబా అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని అఖిలేష్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ రెండు సీట్లకు కూడా ప్రస్తుతం బీఎస్పీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక సీటు నుంచి పోటీచేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో అత్మవిశ్వాసం నెలకొల్పాలన్నది అఖిలేష్ వ్యూహంగా కనిపిస్తోంది. -
యూపీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా ఇదే..
దేశంలోని రాష్ట్రాల్లో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో పిల్లల జనాభా కూడా అత్యధికమే. రాష్ట్రంలో దాదాపు 20 కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో నాలుగోవంతు మంది 5- 14 ఏళ్ల లోపు పిల్లలే ఉన్నారు. అయితే వారిలో ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు వెళ్లే పిల్లల సంఖ్య బాగా తక్కువ. విద్యార్థులకు ఉండాల్సిన నిష్పత్తి కన్నా టీచర్ల సంఖ్య కూడా బాగా తక్కువ. నేర్చుకునే సామర్థ్యం కూడా వారిలో తక్కువ. బడికి పోయే వారిలో పనికిపోయే పిల్లలు కూడా ఎక్కువ. ఇన్ని రకాలుగా విద్యారంగంలో వెనుకబడి పోతున్న ఉత్తరప్రదేశ్‌లో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేయడమే ఎన్నికల్లో పోటీచేసే ప్రతి పార్టీ ప్రధాన ఎజెండా కావాలి. ‘బీమారు’ రాష్ట్రాల్లోనే అక్షరాస్యత, నేర్చుకునే సామర్థ్యం తక్కువ. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలిపి బీమారు రాష్ట్రాలని పిలుస్తున్నారు. 2020 నాటికి దేశంలో పనిచేసే వయో జనాభా 86.90 కోట్లకు చేరుకుంటోందని అంచనా వేసిన నేపథ్యంలో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఐదేళ్ల నుంచి 14 ఏళ్లలోపు చదువుకునే పిల్లల జనాభా 43.6 శాతం ఉంటుందని ‘ఇండియా స్పెండ్’ అంచనా వేసింది. వీరందరికీ విద్యను అందించే సౌకర్యాలు మాత్రం అందుబాటులో ఉండవని విశ్లేషించింది. అక్షరాస్యత అంతంత మాత్రమే 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో అక్షరాస్యత 67.72 శాతం. అంటే అక్షరాస్యతలో వెనకబడిన రాష్ట్రాల్లో యూపీది ఎనిమిదో స్థానం. 2001 నాటితో పోలిస్తే దశాబ్దకాలంలో రాష్ట్రంలో అక్షరాస్యత 13.45 శాతం పెరిగింది. అక్షరాస్యత విషయంలో కూడా రాష్ట్రంలో ప్రాంతాలను బట్టి వ్యత్యాసాలు ఉన్నాయి. ఉత్తరాదిలోని స్రవస్తి జిల్లో అక్షరాస్యత 49 శాతం ఉండగా, ఘజియాబాద్ జిల్లాలో 85 శాతం ఉంది. టీచర్లు కూడా చాలా తక్కువ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన యూపీలో టీచర్ల సంఖ్య దారుణంగా ఉంది. ప్రాథమిక స్థాయిలో ప్రతి 39 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడు చొప్పున ఉన్నారు. జాతీయంగా వీరి నిష్పత్తి 23 మంది విద్యార్థులకు ఒక్క టీచరు చొప్పున ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 2015–2016 సంవత్సరంలో 25.30 కోట్ల మంది విద్యార్థులకు 6,65,779 మంది టీచర్లు ఉన్నారని ప్రభుత్వం విద్యారంగం డేటా తెలియజేస్తోంది. విద్యాహక్కు ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు కనీసం ఒక్క టీచరు ఉండాలి. ఆ లెక్క ప్రకారం యూపీకి 8,40,000 మంది టీచర్లు అవసరంకాగా, 1,76,000 మంది టీచర్లు తక్కువున్నారు. టీచర్లు విధులకు ఎక్కువగా గైర్హాజరవుతున్న రాష్ట్రాల్లో కూడా యూపీ రెండో స్థానంలో ఉంది. ఖర్చు ఎక్కువ ఫలితాలు తక్కువ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 2014–2015లో ప్రతి ప్రైమరి స్కూల్ విద్యార్థి (ఒకటి నుంచి ఐదో తరగతి వరకు)పై, ప్రతి అప్పర్ ప్రైమరీ స్యూల్ (ఆరు నుంచి ఎనిమిదో తరగతి) విద్యార్థిపై తలసరి 13,102 రూపాయలను ఖర్చుపెట్టింది. ఇదే జాతీయ స్థాయిలో సరాసరి 11,252 రూపాయలు ఉంది. 2011 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు 45 శాతం పెరిగినా విద్యార్థులలో నేర్చుకునే సామర్థ్యం మాత్రం పెరగలేదు. ఇప్పటికీ ఈ విషయంలో దేశంలోనే వెనకబడి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మరీ తగ్గింది ఒకటో తరగతి పుస్తకాన్ని చదివే మూడో తరగతి పిల్లలు 2006లో 31 శాతం ఉండగా, 2014 సంవత్సరం నాటికి వారి సంఖ్య 35 శాతానికి పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలో కనీసం ఇలా చదవగలిగేవారి సంఖ్య కూడా పడిపోతోంది. 2006 సంవత్సరంలో 24 శాతం ఉండగా, 2010 నాటికి వారి సంఖ్య 13 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత ఇంకా తగ్గినట్లు తెలుస్తోంది. లెక్కల విషయంలో కూడా విద్యార్థుల ప్రమాణాలు పడిపోయాయి. బాల కార్మికులు ఎక్కువ పని చేయడం కోసం బడి ఎగ్గొట్టే పిల్లల సంఖ్య కూడా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ. 2014లో ఏసర్ గ్రూప్ చేసిన సర్వే ప్రకారం 55 శాతం విద్యార్థులు మాత్రమే బడులకు హాజరవుతున్నారు. ప్రాథమిక పాఠశాల నుంచి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లే పిల్లల సంఖ్య కూడా ఇక్కడే ఎక్కువ. వారి వాటా 79 శాతమేనని అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. జాతీయ పిల్లల హక్కుల పరిరక్షిణా సంస్థ లెక్కల ప్రకారం 6, 24,000 మంది పిల్లలు పని చేస్తున్నారు. వారిలో 8.4 శాతం మంది పిల్లలు 14 ఏళ్లలోపు ప్రాయంవారే. చట్ట ప్రకారం వారు పనిచేయకూడదని తెల్సిందే. -
అందరి కంటే ముందు మేమే
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగానే.. రాజకీయ వాతావరణం వేడేక్కింది. ఉత్తరప్రదేశ్‌లో అయితే మరింత హాట్‌గా మారింది. అక్కడ రాజకీయ పరిణామాలు గంట గంటకు మారిపోతున్నాయి. తాజాగా అందరికంటే ముందు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) 100 మంది అభ్యర్థులను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో 34 మంది ముస్లిం అభ్యర్థులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో 403 అసేంబ్లీ స్థానాలకు పిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అసేంబ్లీలో బీఎస్పీకి 80 సీట్లే ఉన్నాయి. బీఎస్పీ తొలి జాబితాలో చోటు దక్కించుకున్న కొందరు అభ్యర్థుల వివరాలు.. నవాబ్ ఖాసీం -రాయ్‌పూర్ అలీ యూసఫ్ అలీ- చామారువా మహమ్మద్ ఇస్లాం ఖాన్ -గున్నార్ సయీదా బేగం - బుధానా ముఖేష్ దీక్షిత్- సహారన్పూర్ సిటీ మజీద్ అలీ -దోబాండ్ సత్యేంద్ర సోలంకి -మీరట్ కంటోన్మెంట్ పంకజ్ జోలీ -మీరట్ సిటీ ధర్మపాల్ సింగ్ -ఎత్మాద్పూర్ దివాకర్ దేశ్వాల్- కైరానా రాజాబాల- చప్రౌలి హజీ జకీర్ అలీ -లోని ఆమ్రపాల్ శర్మ - పాహిబాబాద్ సురేష్ బన్సల్ -గాజియాబాద్ రవికాంత్ మిశ్రా -నోయిడా సత్వీర్ సింగ్ గుజ్జార్ -దాద్రి వీద్రంబాటి -జేవార్ ఠాకూర్ జైవీర్ సింగ్- బరేలి రాంవీర్ ఉపాధ్యాయ -సదాబాద్ -
ములాయంపై అఖిలేశ్ రెబల్ అస్త్రం!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ పై రెబల్స్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధం అవుతున్నారా? అంటే తాజా పరిణామాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధుల్లో 325 మంది పేర్లను ములాయం సింగ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ లు బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపిక చేసిన అభ్యర్ధుల్లో అఖిలేశ్ వర్గానికి చెందిన వారికి స్ధానం దక్కలేదు. ఈ నేపథ్యంలో గురువారం అఖిలేశ్ తన అనునూయులతో సమావేశమయ్యారు. పార్టీ అభ్యర్ధులుగా ఎంపిక కానీ నాయకులందరూ రెబల్స్ గా బరిలోకి దిగాలని సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ టిక్కెట్లు దక్కనివారిలో అత్యధికులు ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పని చేస్తున్నవారే. అయితే, ములాయం సింగ్ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన సమయంలో అఖిలేశ్ బుందేల్ ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అభ్యర్ధుల ఎంపికపై మాట్లాడిన ములాయం ఎవరో ఇచ్చిన లిస్టులను బట్టి అభ్యర్ధుల ఎంపిక జరగలేదని చెప్పారు. అభ్యర్ధులను తానే ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎవరు? అన్న విషయాన్ని కూడా పార్టీ ఇప్పుడే వెల్లడించదని చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత పార్టీ నేతలే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని చెప్పారు. అఖిలేశ్ తాను ఎక్కడి నుంచి పోటీ చేయదలుచుకున్నా చేయొచ్చని పేర్కొన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే 78 స్ధానాల్లో అభ్యర్ధులను ఎంపిక చేయకుండా వదిలేశారనే ప్రచారం జరుగుతోంది. -
షీలాదీక్షిత్ ఎవరి ఎంపికో తెలుసా?
ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధిచెందిన ప్రశాంత్ కిషోర్ రచించిన స్క్రీన్ ప్లే ప్రకారమే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన కొనసాగుతోందని స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన చేసిన ప్రతిపాదన మేరకే యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను రంగంలోకి దింపడం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం కాదు. కానీ ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పట్టుబట్టారు. బ్రాహ్మణ వర్గం నుంచే సీఎం అభ్యర్థి ఉండాలని కూడా సూచించారు. ఆయన మొదటి ప్రాధాన్యం ప్రియాంక గాంధీకాగా, రెండో ప్రాధాన్యం షీలా దీక్షిత్. రాహుల్‌కు పార్టీలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రియాంకను రంగంలోకి దించడం పార్టీ అధిష్టానానికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నా.. షీలా దీక్షిత్‌ను రంగంలోకి దింపక తప్పలేదు. ముందుగా పార్టీ సీనియర్ నాయకుల నుంచి రాజ్‌బబ్బర్ పేరు తెరమీదకు రాగా, పార్టీలో ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన కూడా సాగడం లేదనే వదంతులు వచ్చాయి. యూపీలో ఉన్న 12 శాతం బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవాలంటే షీలాదీక్షిత్‌ను రంగంలోకి దించక తప్పదనే ప్రశాంత్ కిషోర్ వాదనతో కాంగ్రెస్ అధిష్ఠానం ఏకీభవించింది. యాదవులు, జాట్లకు వ్యతిరేకంగా బ్రాహ్మణులను ఆకర్షించక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. యాదవులు, దళితుల్లో ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు పట్టు ఎక్కువగా ఉంది. బీజేపీని ప్రస్తుతం రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్న బ్రాహ్మణవర్గాన్ని ఆకర్షించడమే సులువైన మార్గమన్నది కిషోర్ అభిప్రాయం. పైగా షీలా దీక్షిత్ యూపీ కోడలు కూడా. ఆమె మామ ఉమా శంకర్ దీక్షిత్ యూపీలో పేరుపొందిన బ్రాహ్మణ నాయకుడు. ఓ వ్యక్తిపైనే ప్రధానంగా ప్రచారాన్ని కేంద్రీకరించి పనిచేయడం ప్రశాంత్ కిషోర్‌కు అలవాటు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా, ఆ తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌పైనా దృష్టిని కేంద్రీకరించే ప్రచారవ్యూహాన్ని అమలు చేసి.. విజయం సాధించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఈసారి కూడా ప్రచారం చేయనున్నా.. పార్టీ ప్రచార బాధ్యతలను ఆమెకు పూర్తిగా అప్పగించడం లేదు. ఇదివరకు రాహుల్ గాంధీ విషయంలో చేసిన పొరపాటును ప్రియాంక గాంధీ విషయంలో చేయరాదన్నది పార్టీ అధిష్టానం ఉద్దేశం. అందుకనే పార్టీ ఈసారి అన్ని సామాజిక వర్గాల నుంచి ఎంపికచేసిన నాయకులకు పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఫలితం ఎలా ఉంటుందో చూడాలని స్థానిక పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైతే ఆ పరాభవం బాధ్యతను ప్రియాంక గాంధీ పంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆమె మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
యూపీ అంతటా ప్రియాంకగాంధీ ప్రచారం!
న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్‌లో కేవలం రాయ్‌బరేలీ, ఆమేథీ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రియాంకగాంధీ ప్రచారం చేశారు. ఈ రెండు నియోజకవర్గాలు తన తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్‌గాంధీవి కావడంతో ఆమె ఈ రెండు నియోజకవర్గాలకు పరిమితమై ప్రచార బాధ్యతలు చేపట్టారు. కానీ, త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమె రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఇదే విషయమై యూపీ కాంగ్రెస్ ఇన్చార్జి, పార్టీ జనరల్ కార్యదర్శి గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ..ఆమేథీ, రాయ్ బరేలీ ఆవల కూడా ప్రచారం చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహ రచనపై రెండ్రోజులపాటు రాష్ట్ర సీనియర్ నాయకులతో మేధోమథనం జరిపేందుకు ఆయన గురువారం లక్నో వెళ్లనున్నారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని ఆయన ఇంతకుముందే తెలిపారు. ఇక, క్రియాశీల రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలో నిర్ణయించుకోవాల్సింది ప్రియాంకేనని మరో సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. -
గూండాల ప్రభుత్వాన్ని కూలదోస్తా
ఉత్తరప్రదేశ్‌లో తాము అధికారంలోకి వచ్చి తీరుతామని, సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలో ఉన్న గూండాలు, మాఫియాల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తానని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన భారీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపైనా ఆమె నిప్పులు కక్కారు. ఈ మూడూ అవకాశవాద పార్టీలని, ఎన్నికల లబ్ధి కోసం దళితులను ఊరిస్తున్నాయని అన్నారు. కేవలం యూపీలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఉన్న దళితులు ఈ పార్టీల కబుర్లను జాగ్రత్తగా వినాలని, ఎన్నికల లబ్ధి తప్ప వారికి నిజంగా ఈ అంశాలపై నిబద్ధత లేదని అన్నారు. యూపీలో ఉన్న దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో కూలదోయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన రాజకీయ గురువు, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ స్వయంగా చెప్పడం వల్లే తాను యూపీలో అధికారంలో ఉన్నప్పుడు తన సొంత విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నట్లు మాయావతి వివరించారు. ఇతర పార్టీలు తనపై కుట్ర పన్నాయని, పార్కులలో ఏనుగుల బొమ్మలు పెట్టినందుకు కూడా విమర్శించాయని ఆమె చెప్పారు. తమ పార్టీ గుర్తును ప్రచారం చేసుకోడానికే ప్రయత్నించినట్లు వాళ్లు అన్నారు గానీ, తాను మాత్రం వాటిని స్వాగత చిహ్నాలుగా మాత్రమే ప్రతిష్ఠించానన్నారు.