కసబ్ అన్నా.. ఖబరిస్థాన్ అన్నా గెలిపించారు! | bjp gains despite kasab and khabarstan comments of narendra modi | Sakshi
Sakshi News home page

కసబ్ అన్నా.. ఖబరిస్థాన్ అన్నా గెలిపించారు!

Published Tue, Mar 14 2017 2:35 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

కసబ్ అన్నా.. ఖబరిస్థాన్ అన్నా గెలిపించారు! - Sakshi

కసబ్ అన్నా.. ఖబరిస్థాన్ అన్నా గెలిపించారు!

మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీ ఒక్కదానికే 312 స్థానాలు వచ్చాయి.

మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీ ఒక్కదానికే 312 స్థానాలు వచ్చాయి. అంటే, నాలుగింట మూడొంతుల మెజారిటీ అన్నమాట. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు ఉండటం చాలా అవసరం. ఉత్తరాఖండ్‌లో కూడా ఇంతకంటే ఎక్కువ స్థాయిలోనే బీజేపీ విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ - సమాజ్‌వాదీ పార్టీలు పొత్తు పెట్టుకుని ఒకటిగా పోటీచేసినా కూడా వాళ్లు 54 స్థానాలు మాత్రమే సాధించారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం సమయంలో 'కసబ్' అని, 'ఖబరిస్థాన్' అని.. ఇలా పలు రకాల మాటలు వినిపించాయి. ప్రచార పర్వంలో దూషణభూషణలు చాలా తీవ్రస్థాయిలో ఉండటంతో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగాలలో ఇలాంటి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు తీవ్రంగా విమర్శించారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోడానికి మోదీ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ అంటూ చిట్టా చదివారు. కానీ అవేమీ పని చేయలేదు. అంతేకాదు.. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడ్డారని, బీజేపీని గెలిపిస్తే ఇక్కడ మరింత అరాచకం తప్పదని చేసిన ప్రచారాలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ వనవాసం తర్వాత బీజేపీ మళ్లీ ఉత్తరప్రదేశ్‌లో అధికారం సాధించింది.

కసబ్‌కు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ ఓ సభలో చెప్పారు. క అంటే కాంగ్రెస్, స అంటే సమాజ్‌వాదీ, బ అంటే బహుజన సమాజ్‌ పార్టీ అని దానికి అర్థం చెప్పారు. ఇక హిందూ ముస్లింల గురించి మాట్లాడుతూ, 'ఖబరిస్థాన్‌లో కరెంటు ఉంటే శ్మశానంలో కూడా ఉండాలి. రంజాన్‌కు కోతలు లేకుండా కరెంటు ఇస్తే.. దీపావళికి కూడా అలాగే ఇవ్వాలి. మతాల మధ్య భేదభావాలు ఉండకూడదు' అని మరో సందర్భంలో వ్యాఖ్యానించారు. మోదీ చేసిన ఈ తరహా వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.  నిజానికి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా కూడా బీజేపీకి ప్రజలు పట్టం గట్టారు. ముస్లిం ఓట్లలో చీలిక రావడం, సమాజ్‌వాదీ పార్టీ కుటుంబంలో విభేదాలు, పార్టీకి పెద్దదిక్కు అయిన ములాయం సింగ్ యాదవ్ లాంటివాళ్లు అసలు ప్రచారం చేయకపోవడం లాంటివి సమాజ్‌వాదీ పార్టీని దెబ్బతీయడంతో పాటు బీజేపీకి కూడా ఓట్లను గణనీయంగా పెంచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement