నాడు ముస్లింలూ మోదీకే ఓటేశారు! | why did muslims voted narendra modi | Sakshi
Sakshi News home page

నాడు ముస్లింలూ మోదీకే ఓటేశారు!

Published Tue, Feb 7 2017 5:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నాడు ముస్లింలూ మోదీకే ఓటేశారు! - Sakshi

నాడు ముస్లింలూ మోదీకే ఓటేశారు!

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కుల, మతాల ప్రాతిపదిక ఎన్నికలు జరుగుతాయని, ముఖ్యంగా ముస్లింలంతా గంప గుత్తాగా ఒక్క పార్టీకే ఓటేస్తారని, అందులోను ముఖ్యంగా బీజేపీని ఓడించే సామర్థ్యం ఉన్న పార్టీకి ఓటేస్తారని, అది వారి మనస్తత్వమని  సాధారణ ప్రజల నుంచి సామాజిక శాస్త్రవేత్తల వరకు విశ్లేషిస్తూ వస్తున్నారు. అదంతా ఒట్టి భ్రమేనని ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ జిల్లా బక్షా అనే ముస్లింలు ఎక్కువగా ఉండే గ్రామంలో పలువురు ప్రజల నుంచి  మీడియా అభిప్రాయాలు సేకరించగా వెల్లడయింది. పది శాతం ముస్లిం జనాభావున్న బక్షా గ్రామాన్ని కూడా సామాజిక శాస్త్రవేత్తలు తమ విశ్లేషణల్లో ప్రస్తావించారు గనుక మీడియా ఈ గ్రామాన్ని అభిప్రాయ సేకరణకు ఎంచుకోవాల్సి వచ్చింది.

నాడు బీఎస్సీ, ఆతర్వాత ఎస్పీకి, తర్వాత మోదీకి ఓటు
ఈ గ్రామంలోని ముస్లింలు ఎక్కువగా 2007 ఎన్నికల్లో బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)కి ఓటేయగా, 2012లో సమాజ్‌వాది పార్టీకి, 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. ఒక్కపార్టీకి ఓటేయడం అనేది వీరిలో ఉందిగానీ, ఫలానా పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలనే భావన లేదు. వీరు తమ ముస్లిం అభ్యర్థులకు వ్యతిరేకంగా కూడా ఈ ఎన్నికల్లో ఓటేశారు. ఎన్నికల గాలి ఎటువైపు వీస్తుందో, ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందో తెలుసుకొని వారు ఓటేస్తారు. అంటే తమ ఓటు దుర్వినియోగం కారాదన్నదే వారి ఆలోచన. ఓటేసే ముందు ‘ఎవరికి ఓటేయాలనుకుంటున్నావు లేదా ఎవరికి ఓటేశావు?’ అని ఇరుగు పొరుగు ప్రజలను ఒకటికి రెండుసార్లు సంప్రతించి ఓటేస్తారు.


సమాజ్‌వాది పార్టీకే వేశాను
మొహమ్మద్‌ ముక్తార్‌ అలీ అనే 42 ఏళ్ల దివ్యాంగుడు గత కొన్నేళ్లుగా గ్రామంలో దర్జీ పనిచేసుకొని బతుకుతున్నారు. ఓ కాలు పొట్టిగా మరో కాలు పొడుగ్గా ఉండడం వల్ల ఆయనకు గత 18 ఏళ్లుగా పింఛను వస్తోంది. 2007లో మాయావతి నాయకత్వంలోని బీఎస్పీకి ఓటేశారు. మాయావతి ప్రభుత్వం హయాంలో ఓ నెల హఠాత్తుగా దివ్యాంగుల పింఛను ఆగిపోయింది. ప్రభుత్వాధికారి వద్దకు వెళితే ఆయనే దగ్గరికి వచ్చి సమస్య ఏమిటని వాకబు చేశారు. బ్యాంకు ఖాతా నెంబరు తీసుకొని ఒక్కరోజులేనే పింఛను వస్తుందని భరోసా ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగానే ఒక్కరోజులోనే పింఛను సొమ్ము వచ్చి ఆయన బ్యాంకులో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు పింఛను ఆగలేదు. 2012 ఎన్నికల్లో మాత్రం ఆయన సమాజ్‌వాది పార్టీకి ఓటేశారు.

ఓటు వధా కారాదు
అలా ఎందుకు ఓటేశారని ప్రశ్నిస్తే, తమ ప్రాంతం వారంతా ఎస్పీకి ఓటేస్తున్నారని తెలిసి ఓటు వధా కాకుడదన్న ఉద్దేశంతో ఎస్పీకి ఓటేశానని, 2007లో కూడా తోటి వారి అభిప్రాయం మేరకు మాయావతి పార్టీకి ఓటేశానని చెప్పారు. 2014 ఎన్నికల గురించి ప్రశ్నించగా అప్పుడు దేశమంతా మోదీ పేరు మోగి పోతుంది కనుక ఆయనకే ఓటేశానని చెప్పారు. కేవలం ముస్లింలు ఓటు ఎటు వేస్తున్నారన్న అంశాన్నే పరిగణలోకి తీసుకొని ఓటేస్తారా? అని ఆయన్ని మీడియా ప్రశ్నించగా, ‘నేను నా ప్రాంతం వారన్నానుగానీ, ముస్లింలని చెప్పడం లేదు. నా ప్రాంతంలోని హిందువులు, క్రైస్తవులు, ఇతర ప్రాంతాల అందరి అభిప్రాయలను తీసుకొనే ఓటేస్తాను. మంచి వాళ్లు గెలవాలి, మా ప్రాంతం బాగు పడాలన్నదే మా తాపత్రయం’ అని ఆయన చెప్పారు. తన వద్దకు ఎంతోమంది హిందూ యువతులు, స్త్రీలు వచ్చి బట్టలు కుట్టించుకుంటారని, వారంతా తనను చాచా, చాచా అని ఎంతో అప్యాయంగా పిలుస్తారని, అలాంటప్పుడు తనకు ముస్లింననే భావన ఎక్కడుంటుందని ప్రశ్నించారు. ఆయనింటి ఇరుగు పొరుగున నాయీ బ్రాహ్మణలు, యాదవులు, మౌర్యులు, బ్రాహ్మణుల ఇళ్లు కూడా ఉన్నాయి.


ముస్లిం మహిళ మెడలో మంగళసూత్రం
బక్షా ఊరులో సయ్యద్‌ బాబా దర్గా ఉంది. ముస్లింలకన్నా హిందువులే ఎక్కువగా ఆ దర్గాను సందర్శిస్తారు. పక్క వీధిలోనే మీడియాకు చీరల్లో ఇద్దరు స్త్రీలు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కనిపించారు. వారిలో ఒకరి మెడలో మంగళసూత్రం ఉంది. మరొకరి నుదుటన సింధూరం ఉంది. వారెవరని వాకబు చేస్తే ఆశ్చర్యంగా వారు ముస్లిం మహిళలని తెల్సింది. వారిలో ఒకరి పేరు పర్వీనా బానో, మరొకరు జులేఖా బేగమ్‌ అని తెల్సింది. తాము వత్తిని నమ్ముకుని బతుకుతున్నాంగానీ, మతాన్ని కాదని వారు చెప్పారు. ఆ ఊరిలో ముస్లిం స్త్రీలు చీరలు కట్టుకోవడం, సింధూరం పెట్టుకోవడం, పిల్లలు చుడేదార్‌ పైజామా ధరించడం, ముఖాన అంగవస్త్రం ధరించడం ఫ్యాషన్‌గా మరిపోయిందని చెప్పారు. వారిద్దరు కూడా టెయిలర్‌ వృత్తి చేస్తారట. రాజకీయాల గురించి అడిగితే తమకు తెలియవని  చెప్పారు.

చాయ్‌ బేజ్‌నే వాలేకో చడాయి....
అదే వీధిలో మరో వయోధికురాలిని ప్రశ్నించగా ‘చాయ్‌ బేజనే వాలేకో చడాయిదియా, ఔర్‌ వో ఊపర్‌ సే కుడాయి దియా (చాయ్‌ అమ్ముకునే ఆయన్ని అందలం ఎక్కిస్తే ఆయన మరుగుతున్న చాయ్‌ను మా అందరి నెత్తిల మీద పోశారు)’ అంటూ దేశంలో పెద్ద నోట్ల రద్దును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మేము ముస్లింలం అయినప్పటికీ గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీకి ఓటేస్తే ఆయనేం చేశారో చూడండి’ అంటూ పక్కనే ఉన్న ఆమె భర్త మొహమ్మద్‌ రయీస్‌ వ్యాఖ్యానించారు. భార్యాభర్తలు దారిద్య్ర రేఖకు దిగువనే జీవిస్తున్నప్పటికీ వీరికి కేంద్ర పింఛనుగానీ, సమాజ్‌వాది రాష్ట్ర ప్రభుత్వం పింఛనుగానీ అందడం లేదట. తాను గాజులు విక్రయిస్తూ జీవిస్తున్నామని, పెద్ద నోట్లకు రద్దుకు ముందు రోజుకు వందరూపాయలకు పైగా ఆదాయం రాగా ఇప్పుడు 70 రూపాయలకు మించడం లేదని ఆయన తెలిపారు.

మంచి పనిచేసే వారికే ఓటు
సైకిళ్లపై తిరుగుతూ చీరలమ్మే వారిని పలకరించగా పెద్ద నోట్ల రద్దుతో తమ వ్యాపారం కూడా ఘోరంగా పడిపోయిందని, గ్రామంలో ఎవరు కూడా సుఖంగా జీవించడం లేదని చెప్పారు. వారి వార్షికాదాయం గురించి ప్రశ్నించగా 30 వేల రూపాయలకు మించి ఉండదని వారిలో ఒకరైన లాల్‌ మొహమ్మద్‌ తెలిపారు. ఏడాదికి 36వేల రూపాయల లోపు ఆదాయం వచ్చే నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయల భృతిని ఇస్తోంది. వీరిద్దరికైతే అది రావడం లేదట. అయినా మొదటి నుంచి సమాజ్‌వాది పార్టీకే ఓటు వేస్తున్నారట. మంచి పని ఎవరు చేస్తే వారికేస్తాం అది వారు చెప్పారు. అఖిలేష్‌ యాదవ్‌ చేసిన మంచి పనులేమిటో చెప్పమని వారిని ప్రశ్నించగా వారు చెప్పలేకపోయారు. ఎవరికో ఒకరికి మంచి పనులు చేస్తున్నారుగదా అని అనుకుంటున్నాంగానీ తమకేమీ తెలియదని చెప్పారు. మెకానిక్‌ షాపులు, చిన్న దుకాణాలు, రెడీమేడ్‌ షాపులు నడుపుతున్న ముస్లింలను, గృహిణులను ఈసారి ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్నించగా, ఎవరు మంచి పనులు చేస్తే వారికని, ఎవరు గెలిచే అవకాశం ఉంటే వారికి ఓటేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒక నిర్ణయానికి మాత్రం రాలేదని ఎక్కువ మంది చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement