
సమీకరణల బాద్‘షా’
- ఎస్పీ, బీఎస్పీలకు రివర్స్‌లో వ్యూహాలు
- విజయమే లక్ష్యంగా 2014 నుంచే వ్యూహాలు
- అన్ని తానై నడిపించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు
సాక్షి, న్యూఢిల్లీ: 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో తన వ్యూహాలతో బీజేపీకి 71 లోక్‌సభ స్థానాలను సాధించిపెట్టిన అమిత్ షా.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేశారు. మినీ భారతదేశంగా పరిగణించే యూపీలో విజయమే లక్ష్యంగా అమిత్ షా రచించిన ప్రణాళిక రాష్ట్ర చరిత్రలో కనీవినీఎరుగని రీతిలో బీజేపికి విజయాన్ని తెచ్చిపెట్టాయి. 2014 సాధారణ ఎన్నికలు ముగియగానే యూపీపై పూర్తి దృష్టి సారించిన షా అందుకు తగ్గట్టుగానే తన రాజకీయ చతురతను ప్రదర్శించారు.
బూత్ స్థాయిలో పార్టీని పటిష్టపరుస్తూ చిట్టచివరి వ్యక్తి వరకు బీజేపీ లక్ష్యాలను తీసుకెళ్లగలిగారు. యూపీలో బీజేపీ ప్రభంజనం సృష్టించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా ఒక కారణం అయితే ములాయం సింగ్ కుటుంబంలో ములసం, దళితుల ఓట్లు కూడా సాధించుకోలేకుండా మరీ బలహీనంగా మారిన బీఎస్పీ మరో కారణం. ఈవీఎంలను ట్యాంపర్ చేశారని మాయవతి ఆరోపణలు చేసినా, కుటుంబ కలహాలు, ప్రణాళికల అమలులో లోపాల వల్ల ఓడినట్టు అఖిలేష్ ఓటమిని అంగీకరించినా.. ఈ ఇద్దరూ దగ్గరుండి మరి బీజేపీ విజయనికి మార్గం సుగమం చేశారు. బీజేపీకి చారిత్రక విజయాన్ని అందించారు.
ఎస్పీ, బీఎస్పీల ఓటు బ్యాంకుకు పక్కా స్కెచ్..
ఇక అమిత్ షా ప్రణాళికల విషయానికొస్తే ప్రధాని మోదీ తన వెనకున్నాడన్న బలమైన కారణంతో తను వేసిందే వ్యూహం అన్నట్టు ప్రణాళికలను రచించారు. అగ్రవర్ణాలైన రాజ్‌పుత్‌లు, బ్రహ్మణ, బనియా వర్గాలకు చెందిన వారి పార్టీగా ముద్రవేసుకున్న బీజేపీ.. ఎస్పీ, బీఎస్పీలకు ప్రధాన ఓటు బ్యాంకు అయిన యాదవ యేతర ఓబీసీలు, కోయిరీ, కుర్మీ, రాజ్‌బర్, దళితులు, ముస్లింల ఓట్లను బీజేపీకి రాబట్టడంలో సఫలీకృతం అయ్యారు. బీఎస్పీలో అసంతృప్తు దళితనేతలైన బాబుసింగ్ కుషవాహా, బద్షా సింగ్, దడ్డన్ మిశ్రా, అవదేశ్ కుమార్ వర్మా లాంటి సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకొని రాష్ట్రంలో 21 శాతం ఉన్న దళితుల ఓటు బ్యాంకులో చాలా వరకు బీజేపీ వైపు మొగ్గుచూపేలా చేశారు.
రాష్ట్రంలో 18 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లలో బీజేపీకి రెండు శాతం ఓట్లే లభించాయని సర్వేలు చెబుతున్నప్పటికీ ఈ వర్గాల ఓట్లే బీజేపీకి మెజారిటీ దక్కేలా చేశాయన్నది వాస్తవంగా కనిపిస్తోంది. ఎస్పీ, బీఎస్పీల వ్యూహాలకు పూర్తిగా రివర్స్‌లో ప్రణాళికలు రచించిన షా ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకులను బీజేపీకి దక్కేలా చూసుకున్నారు.
ఎస్పీ–కాంగ్రెస్, బీఎస్పీలకు ధీటుగా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన అమిత్ షా పోటాపోటీ రోడ్ షోలతో తన వ్యూహాలకు పదునుపెట్టారు. తన ప్రచారంలో ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీలైతే నువ్వు లేదా నేను అన్న రీతిలో ఎస్పీ, బీఎస్పీలు యూపీని దోచుకున్నాయని విమర్శలు గుప్పించారు. కేంద్ర క్యాబినేట్‌లోని డజను కంటే ఎక్కువ మంది మంత్రులను ప్రతిక్షణం ప్రచారంలో దింపి వారి వర్గాల ఓట్లు ఇతరుల వైపు మళ్లకుండా జాగ్రత్తపడ్డారు.
అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ముందుగానే ప్రకటించకుండా ఎన్నికల ముందు పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తి కలగకుండా షా చూసుకున్నారు. సీనియర్లు అందరూ ఎన్నికలపైనే దృష్టి పెట్టేలా వారందరినీ నడిపించారు. ప్రధాని తన పనులు మానుకొని మరీ యూపీలో వీలైనన్ని ఎక్కువ ప్రాంతల్లో ప్రచారం చేసేలా చూసుకున్నారు.
తూర్పు యూపీలో ఎన్నికల చివరి విడతలో ఏకంగా మూడు రోజుల పాటు మోదీ మకాం వేసి గతంలో ఏ ప్రధాని చేయనట్టు రోడ్ షోలు నిర్వహింపజేశారు. అలాగే పార్టీ అనుబంధ సంఘాలు వాటి స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగేలా దిశానిర్దేశం చేశారు. మొత్తానికి యూపీలో బీజేపీ విజయం సాధించడానికి మోదీ చరిష్మా ఒక కారణం అయితే, కనిపించే అమిత్ షా ప్రణాళికలు మరో కారణం అని చెప్పవచ్చు.