16 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు
మథుర: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికలోనైనా పోటీ చేసి ఓడిపోవడం ఆయనకు అలవాటు. ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లోకూడా ఆయన పోటీ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నమోదైన తొలి నామినేషన్ కూడా ఆయనదే. ఆయన పేరు ఫక్కడ్ బాబా. మథుర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి, మార్చిల్లో ఐదు దశల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాల్లో కొత్త వేడి రాజుకున్న సంగతి తెలిసిందే.
ఫక్కడ్ బాబా 1977 నుంచి 16 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన బాబా అన్నింట్లోనూ ఓటమిని చవి చూశారు. వాటిలో 8 జాతీయ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా తాను గెలవనని ముందే చెప్పారు. నామినేషన్ వేయడానికి రూ.10వేలు విరాళాలు సేకరించుకున్నట్లు వెల్లడించారు. బాబాకు ఎలాంటి ఆస్తులు లేవు. గుళ్లలో, ప్రభుత్వం ఏర్పాటుచేసిన నైట్ షెల్టర్లలో బస చేస్తుంటారు.
తన గురువైన జగన్నాథ్ పూరీకి చెందిన శంకరాచార్యులు కలలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయమని ఆదేశించారని, అందుకే పోటీ చేస్తున్నానని చెప్పారు. రాజకీయ నాయకులంతా అబద్ధాల కోరులే అని, తాను గెలిస్తే వ్యవస్థను శుద్ధి చేస్తానని అన్నారు. ఇన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన బాబాకు అన్నిటికన్నా ఎక్కువగా 1991 ఎన్నికల్లో ఎనిమిది వేల ఓట్లు వచ్చాయట. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయనకు రూ.84 వేల విరాళాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో హేమమాలినిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.