ఎగ్జిట్ పోల్స్ నమ్మం.. అధికారం మాదే!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ మూడో స్థానానికి పరిమితమవుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీఎస్పీ నిర్ద్వంద్వంగా ఖండించింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఎంతమాత్రం నమ్మబోమని బీఎస్పీ పేర్కొంది. తాజా యూపీ ఎన్నికల్లో అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ బోగసేనని, ఈ విషయంలో కౌంటింగ్ రోజు తేలుతుందని బీఎస్పీ పేర్కొంది.
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు కోసం అవసరమైతే బీఎస్పీతో చేతులు కలుపుతామన్న యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. యూపీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధిస్తామంటూ ప్రచారం సందర్భంగా అఖిలేశ్ చెప్పివన్నీ డాంబికాలేనని ఈ వ్యాఖ్యతో తేలిపోయిందని, ఈ ప్రకటనలో ఆయన బలహీనత కనిపిస్తున్నదని బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ మండిపడ్డారు.