ఎగ్జిట్ పోల్స్: అఖిలేశ్ సంచలన ప్రకటన
లక్నో: కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలు వెల్లడించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం అవసరమైతే.. బీఎస్పీతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని అధికారంలోకి రాకుండా చూడటమే తమ ధ్యేయమని, అందుకోసం తన బద్ధవిరోధి అయిన మాయావతితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన పేర్కొన్నారు.
యూపీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. అయితే, ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దక్కే అవకాశం లేదని తేల్చాయి. యూపీలో హంగ్ అసెంబ్లీ వస్తుందని అంచనా వేశాయి. హంగ్ అసెంబ్లీ కనుక ఏర్పాటైతే.. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశముంది. ఈ నేపథ్యంలో మాయావతి ఎవరివైపు మొగ్గుచూపితే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హంగ్ అసెంబ్లీ కనుక ఏర్పాటైతే.. మాయావతి ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తికరమైన అంశమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.