షీలాదీక్షిత్ ఎవరి ఎంపికో తెలుసా?
ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధిచెందిన ప్రశాంత్ కిషోర్ రచించిన స్క్రీన్ ప్లే ప్రకారమే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన కొనసాగుతోందని స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన చేసిన ప్రతిపాదన మేరకే యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను రంగంలోకి దింపడం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం.
ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం కాదు. కానీ ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పట్టుబట్టారు. బ్రాహ్మణ వర్గం నుంచే సీఎం అభ్యర్థి ఉండాలని కూడా సూచించారు. ఆయన మొదటి ప్రాధాన్యం ప్రియాంక గాంధీకాగా, రెండో ప్రాధాన్యం షీలా దీక్షిత్. రాహుల్‌కు పార్టీలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రియాంకను రంగంలోకి దించడం పార్టీ అధిష్టానానికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నా.. షీలా దీక్షిత్‌ను రంగంలోకి దింపక తప్పలేదు.
ముందుగా పార్టీ సీనియర్ నాయకుల నుంచి రాజ్‌బబ్బర్ పేరు తెరమీదకు రాగా, పార్టీలో ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన కూడా సాగడం లేదనే వదంతులు వచ్చాయి. యూపీలో ఉన్న 12 శాతం బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవాలంటే షీలాదీక్షిత్‌ను రంగంలోకి దించక తప్పదనే ప్రశాంత్ కిషోర్ వాదనతో కాంగ్రెస్ అధిష్ఠానం ఏకీభవించింది. యాదవులు, జాట్లకు వ్యతిరేకంగా బ్రాహ్మణులను ఆకర్షించక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. యాదవులు, దళితుల్లో ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు పట్టు ఎక్కువగా ఉంది. బీజేపీని ప్రస్తుతం రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్న బ్రాహ్మణవర్గాన్ని ఆకర్షించడమే సులువైన మార్గమన్నది కిషోర్ అభిప్రాయం. పైగా షీలా దీక్షిత్ యూపీ కోడలు కూడా. ఆమె మామ ఉమా శంకర్ దీక్షిత్ యూపీలో పేరుపొందిన బ్రాహ్మణ నాయకుడు.
ఓ వ్యక్తిపైనే ప్రధానంగా ప్రచారాన్ని కేంద్రీకరించి పనిచేయడం ప్రశాంత్ కిషోర్‌కు అలవాటు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా, ఆ తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌పైనా దృష్టిని కేంద్రీకరించే ప్రచారవ్యూహాన్ని అమలు చేసి.. విజయం సాధించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఈసారి కూడా ప్రచారం చేయనున్నా.. పార్టీ ప్రచార బాధ్యతలను ఆమెకు పూర్తిగా అప్పగించడం లేదు. ఇదివరకు రాహుల్ గాంధీ విషయంలో చేసిన పొరపాటును ప్రియాంక గాంధీ విషయంలో చేయరాదన్నది పార్టీ అధిష్టానం ఉద్దేశం.
అందుకనే పార్టీ ఈసారి అన్ని సామాజిక వర్గాల నుంచి ఎంపికచేసిన నాయకులకు పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఫలితం ఎలా ఉంటుందో చూడాలని స్థానిక పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైతే ఆ పరాభవం బాధ్యతను ప్రియాంక గాంధీ పంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆమె మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.