
యూపీ అంతటా ప్రియాంకగాంధీ ప్రచారం!
న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్‌లో కేవలం రాయ్‌బరేలీ, ఆమేథీ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రియాంకగాంధీ ప్రచారం చేశారు. ఈ రెండు నియోజకవర్గాలు తన తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్‌గాంధీవి కావడంతో ఆమె ఈ రెండు నియోజకవర్గాలకు పరిమితమై ప్రచార బాధ్యతలు చేపట్టారు.
కానీ, త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమె రాష్ట్రమంతటా తిరిగి ప్రచారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఇదే విషయమై యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి, పార్టీ జనరల్ కార్యదర్శి గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ..ఆమేథీ, రాయ్ బరేలీ ఆవల కూడా ప్రచారం చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహ రచనపై రెండ్రోజులపాటు రాష్ట్ర సీనియర్ నాయకులతో మేధోమథనం జరిపేందుకు ఆయన గురువారం లక్నో వెళ్లనున్నారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని ఆయన ఇంతకుముందే తెలిపారు. ఇక, క్రియాశీల రాజకీయాల్లోకి ఎప్పుడు రావాలో నిర్ణయించుకోవాల్సింది ప్రియాంకేనని మరో సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు.